ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికార పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశం జారీ చేశారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అందరూ కలసి కట్టుగా పని చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లాకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించిన నేపథ్యంలో టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు నేతృత్వంలో జిల్లా పార్టీ నేతలు సీఎం కేసీఆర్ ను బుధవారం ప్రగతి భవన్లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అశ్వారావుపేట మండలం కేంద్రం లో సెంట్రల్ డివైడర్, లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. త్వరలో ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా ప్రగతి కొరకు నిధులను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిందని గుర్తు చేశారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ ఐక్యమత్యంగా కృషి చేయాలని పిలపునిచ్చారు.
సీఎంను కలిసిన వారిలో ప్రభుత్వ విప్-భద్రాద్రి కొత్తగూడెం పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు తాత మధుసూదన్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు-ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ అభ్యర్థి బండి పార్థసారధి రెడ్డి, ఉమ్మడి జిల్లా నుండి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చొరవతో ఖమ్మం జిల్లాకు చెందిన నేతలకు రాష్ట్ర రాజకీయాల్లో అధిక ప్రాధాన్యత లభించిందని ఆ పార్టీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. వారివురి చల్లని చూపులతో ఖమ్మం జిల్లా అభివృద్ధి, పదవుల్లో ఖమ్మంకు సముచిత స్థానం కలగడం హర్షణీయమన్నారు. బుధవారం టీఆర్ ఎస్ రాజ్యసభ అభ్యర్థులు, హెటీరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారధి రెడ్డి, నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర రావుల నామినేషన్ల కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీలో జరిగింది.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొని వారివురికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఇరువురికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ ఖమ్మం జిల్లా అభివృద్ధికి, రాజ్యసభ సభ్యుల ఎంపికలో అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఎంపీ నామ గుర్తు చేశారు. అందులో భాగంగానే జిల్లా నుండి గాయత్రి రవి, పార్థ సారధి రెడ్డి లకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా పదవులు స్వీకరించిన నాయకులు కూడా ఖమ్మం అభివృద్ధికి తమ పరిధిలో ఉన్న అంశాల ఆధారంగా కృషి చేయాలని ఆకాంక్షించారు.