దిగువన గల ఈ ఫొటోలను నిశితంగా పరిశీలించండి. ‘స్టీరింగ్ మా చేతిలోనే ఉన్నా..కారు తప్పుడు మార్గంలో ఎందుకు వెడుతోంది’ (స్టీరింగ్ అప్నే హాత్ మే హై..ఫిర్ యే కార్ గలత్ రాస్తే పర్ క్యూ జారీ?) అన్నది ప్లకార్డులోని సారాంశం. స్టీరింగ్, కారు, దానిపై టీఆర్ఎస్ జెండా గల చిత్రాలను ఓ యువకుడు ప్ల కార్డుపై ప్రదర్శించడం గమనార్హం.
మరో ఫొటోలోని అక్షరాలను గమనించండి. ‘మీ రక్తం ఎప్పుడు మరుగుతుంది..సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకమని చెప్పు..నోరు తెరువు..సమాధానం చెప్పు’ అనేది మరో ఫ్లెక్సీలోని అక్షరాల సారాంశం. ఈ ఫ్లెక్సీలో కేసీఆర్, మహాత్మాగాంధీ ఫొటోలను ఉపయోగించడం విశేషం.
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా శుక్రవారం హైదరాబాద్ లోని పాతబస్తీలో ముస్లింలు నిర్వహించిన తిరంగా ర్యాలీలో కొందరు యువకులు ప్రదర్శించినట్లు ప్రచారం జరుగుతున్న ప్లకార్డులు, ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణాలో ఎంఐఎం-టీఆర్ఎస్ పార్టీల మధ్య స్నేహబంధం అంశంలో భిన్నాభిప్రాయాలు గల పరిస్థితుల్లో తిరంగా ర్యాలీలో ఈ ప్లకార్డుల ప్రదర్శన తీవ్ర చర్చకు దారి తీసింది.