వచ్చే జూన్ 30వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో అధికార పార్టీకి చెందిన ఖమ్మం జిల్లాలోని ‘బిగ్ లీడర్’ ఎవరైనా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? ప్రజా సంగ్రామ యాత్ర వ్యూహం మార్చి అకస్మాత్తుగా ఖమ్మం వైపు మళ్లించడానికి ఇదీ ఒక కారణమేనా? ఇదే నిజమైతే బీజేపీలో చేరే ఆ ముఖ్య నేత ఎవరు? ఆయన ఒక్కరే చేరుతారా? తన అనుచర, అనుయాయ, అభిమాన గణాన్ని కూడా తీసుకుని మూకుమ్మడిగా కాషాయ కండువా కప్పకుంటారా? ఇవీ ఖమ్మం జిల్లా రాజకీయ పరిశీలకుల్లో రేకెత్తుతున్న సందేహాలు.
ఇంతకీ విషయమేమిటంటే… ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను మేడారం నుంచి యాదాద్రి భువనగిరి వరకు నిర్వహించాలని తొలుత ప్రతిపాదించినా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ యాత్ర రూట్ మ్యాప్ ను ఖమ్మం జిల్లాకు మళ్లించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్యోదంతం, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఖమ్మం టార్గెట్ గా బీజేపీ వ్యూహం మార్చిందనే వార్తలు వస్తున్నాయి.
ఇందులో భాగంగానే జూన్ 30వ తేదీన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను ఖమ్మంలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈమేరకు పార్టీ కేంద్ర నాయకత్వం అనుమతికోసం బీజేపీ రాష్ట్ర శాఖ లేఖ కూడా రాసింది. ములుగు జిల్లా మేడారం నుంచిగాని, భద్రాచలం నుంచి గాని మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహణకు రూపకల్పన చేస్తున్నారు. ఏవేని అవాంతరాలు వస్తే తప్ప, యాత్ర ముగింపు సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని బీజేపీ శ్రేణులు స్పష్టంగా చెబుతున్నాయి.
ఖమ్మంలో టీఆర్ఎస్ నేతలను సవాల్ చేసే విధంగా నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్న ఈ భారీ సభకు జనసమీకరణ తదితర అంశాలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో అమిత్ షాను ఖమ్మం రప్పించడం వెనుక బీజేపీ భారీ స్కెచ్ ఉందనే సమాచారం అందుతోంది. అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు బడా లీడర్లు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే తమ పార్టీలో చేరుతారని భావిస్తున్న అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలు కొందరు ఆగస్టు తర్వాత చేరుతారని బీజేపీ ముఖ్య వర్గాలు చెబుతుండడం విశేషం. మొత్తంగా ఖమ్మంలో బీజేపీ సభ, అమిత్ షా రాక వంటి అంశాలు రాజకీయ ప్రకంపనలకు వేదిక కావచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.