గో సేవకు సరైన నిర్వచనం ఏమిటి? దేవాలయాలకు వెళ్లినపుడు అక్కడ గల గోవుల నోటికి ఓ అరటి పండు అందించడమో, నానబెట్టిన శనగలు, ఉలవలను తినిపించడమో, వీలైతే కాస్త పచ్చి గడ్డి వేయడం మాత్రమే గో సేవ కాదు. వాటి ప్రాణాలను రక్షించడం కూడా గో సేవ కిందకే వస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే గోమాత పొట్ట నింపడంకన్నా, దాని ప్రాణాలను రక్షించడమే అసలైన గో సేవగా నిర్వచిస్తున్నారు హర్యానాలోని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు.
రాత్రి వేళల్లో రోడ్లపై జంతువులు నిద్రించడం, అకస్మాత్తుగా వాహనాలకు అడ్డుగా వచ్చి ప్రమాదాల బారిన పడుతుండడం మనం చూస్తుంటాం. కొన్ని ఘటనల్లో ఈ ప్రమాదాలు గుండెలను కలచి వేస్తాయి. ఇటువంటి రోడ్డు ప్రమాదాల్లో మూగజీవాలే కాదు మనుషులు సైతం మత్యువాత పడిన సంఘటనలు అనేకం. మరి కొన్ని ఘటనల్లో లారీల వంటి భారీ వాహనాలు కూడా పశువుల కారణంగా బోల్తా పడుతుంటాయి. ఇక నలుపు రంగులో గల ఆవులు,గేదెల వంటి పశువుల వల్ల బైక్ రైడర్లు అనేక మంది ప్రమాదాల బారిన పడిన ఉదంతాలు కోకొల్లలు.
ఇదిగో ఇటువంటి ప్రమాదాల నివారణకు హర్యానాలోని సర్వ్ కాంట్రాక్టర్ సంగ్, రెసిడెంట్స్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. పంచకుల ప్రాంతంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు, మూగజీవాల ప్రాణ రక్షణే ధ్యేయంగా ఆలోచనను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆవులకు, కుక్కలకు వాటి మెడల్లో రేడియం బెల్టులు కడుతున్నారు. దీంతో రాత్రి వేళ పయనించేవారికి మెడలో రేడియంగల జంతువులు దూరం నుంచే కనిపిస్తాయని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పంచకుల హైవే మార్గంలో 150 ఆవులకు రేడియం బెల్టులు కట్టారట. కోయంబత్తూరు నుంచి వీటిని తెప్పిస్తున్నామని, నాణ్యమైన రేడియం బెల్టులు ధరించిన జంతువులు వాహనదారులకు దూరం నుంచే కనిపిస్తాయని నిర్వాహకులు చెప్పారు. ‘ఒక్క’ ఐడియాతో రెండు ప్రాణాలకు రక్ష.. అటు జంతువులకు… ఇటు మనుషులకు. అదిరింది కదూ ఐడియా!