ముందు దిగువన గల రెండు సోషల్ మీడియా పోస్టులను చదవండి. తర్వాత అసలు విషయంలోకి వెడదాం…
చూశారుగా…? నిన్న వాట్సాప్ యూనివర్శిటీ ద్వారా ప్రచారంలోకి వచ్చిన అంశాలివి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ పదవి ఖరారైందని, తెలంగాణా జాతిపిత, ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు… తెలంగాణా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు రాజ్యసభ స్థానానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని, ఈనెల 18వ తేదీన ఆయన నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారనేది తొలుత వ్యాప్తిలోకి వచ్చిన పోస్టు. ఆ తర్వాత కొద్ది గంటలకే అదే వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మరో పోస్టు చక్కర్లు కొట్టింది.
టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన రాజ్యసభ ఆఫర్ ను పొంగులేటి తిరస్కరించారని, వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారని,ఆయన అడుగులను విపక్షాలు నిశితంగా పరిశీలిస్తున్నాయనేది రెండో పోస్టు సారాంశం. వాస్తవానికి సోషల్ మీడియా ద్వారానే కాదు, ఎలక్ట్రానికి మీడియాకు చెందిన కొన్ని న్యూస్ ఛానళ్లోనూ ఈ వార్త ప్రసారమైంది. శనివారం కొన్ని పత్రికల్లోనూ ఇందుకు సంబంధించిన వార్తా కథనాలు వచ్చాయి కూడా.
అయితే నిజంగానే పొంగులేటికి రాజ్యసభ సీటు ఖరారైందా? పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందా? కేటీఆరే స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాన్ని పొంగులేటి చెవిన వేశారా? పొంగులేటి ఈ బంపర్ ఆఫర్ ను వ్యూహాత్మకంగానే తిరస్కరించారా? ఇవీ పొంగులేటి అభిమానులను తొలుస్తున్న అనేకానేక ప్రశ్నలు. ఇంతకీ పొంగులేటికి రాజ్యసభ సీటు ఖరారైందనే లీకులు ఎవరిచ్చారు? అందువల్ల పొంగులేటికి లాభమా? నష్టమా? ఇవీ సందేహాలే. ఆయా ప్రశ్నలకు సమాధానాల కోసం వెతికినపుడు అనేక అంశాలను, సంశయాలను గుర్తు చేసుకోవలసిందే.
వాస్తవానికి పొంగులేటికి రాజ్యసభ సీటు దక్కితే ఆయన అభిమానుల సంతోషానికి అవధులు ఉండవనేది నిర్వివాదాంశం. కానీ సొంతపార్టీకి చెందిన కొందరు నాయకులు పొంగులేటికి ఈ పదవిని దక్కనిస్తారా? అదే జరిగితే పొంగులేటి మరో పవర్ సెంట్ కావడాన్ని వాళ్లు జీర్ణించుకుంటారా? కేసీఆర్ పొంగులేటికి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాక ఆయా నాయకులు చేయగలిగేమి ఏమీ లేదనేది కూడా వాస్తవమే. కానీ కేసీఆర్ తీసుకునే నిర్ణయానికి ముందు ఈ నాయకులు చేసే ప్రభావిత చర్యలు ఎలా ఉంటాయనేది కూడా ఓ ప్రశ్న.
పొంగులేటికి రాజ్యసభ పదవి ఖరారైనట్లు కాసేపు భావిద్దాం. కానీ ఇటువంటి పదవుల విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే, దాదాపు వారం రోజుల ముందు సంబంధిత నాయకులకు సమాచారాన్ని చేరవేసిన దాఖలాలు గతంలో ఉన్నాయా? కేసీఆర్ మదిలో మాత్రమే ఉండే నిర్ణయాన్ని ఎంతటి సన్నిహితులైనా, కుటుంబ సభ్యులైనా ముందే పసిగట్టగలరా? ఒకవేళ గ్రహించగలిగినా లీక్ చేస్తారా? గతంలో ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయా? ఇవీ ప్రశ్నలే.
ఇకపోతే నిజంగానే పొంగులేటికి బండా ప్రకాష్ రాజీనామా చేయగా ఖాళీ అయిన స్థానానికి ఖరారు చేస్తే ఆయనకు దక్కేది కేవలం రెండేళ్ల పదవి. ఇందుకు పొంగులేటి అంగీకరిస్తారా? పార్టీ నిర్ణయమే శిరోధార్యమని ఆయన భావిస్తే, ఆయననే నమ్ముకున్న మువ్వా విజయ్ బాబు, మట్టా దయానంద్, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, పిడమర్తి రవి, రామసహాయం నరేష్ రెడ్డి, బేబీ స్వర్ణకుమారి తదితర నాయకుల భవిష్యత్తు ఏమిటి?
పొంగులేటి రెండేళ్ల పదవీ కాలం మాత్రమే గల రాజ్యసభ సీటును అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనను పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా ‘లాక్’ చేసినట్లేనా? ఇదే జరిగితే పొంగులేటితోనే తమ పయనమని భావిస్తున్న పలువురు ముఖ్య నేతలకు వచ్చే ఎన్నికల్లో చేకూరే రాజకీయ లబ్ధి ఏమిటి? పొంగులేటి రెండేళ్ల పదవిని స్వీకరిస్తే ప్రస్తుతం ఆయన వెంట ఉన్న నాయకులు అధికార పార్టీలోనే ఉంటారా? ప్రత్యామ్నాయ పార్టీలను వెతుక్కుంటారా? వారందరూ అధికార పార్టీలోనే ఉంటే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని పొంగులేటి వారికి టికెట్లు ఇప్పించగలరా?
ఇటువంటి సవాలక్ష సందేహాలు, సంశయాలు, ప్రశ్నల మధ్య పొంగులేటి రాజ్యసభ పదవి ప్రాచుర్యంలోకి వచ్చింది. పొంగులేటికి ఈ పదవి దక్కుతుందో, లేదోగాని, మొత్తంగా అధికార పార్టీ రాజకీయాల్లో పొంగులేటికి దక్కే పదవీ ప్రయోజనం ఇప్పుడో హాట్ టాపిక్… అంతే…!