ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. వర్తమాన రాజకీయాలను, కొందరు నాయకుల స్థితిని ఉటంకిస్తూ ఈ పోస్టును నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని ఓ ప్రముఖ నాయకుని రాజకీయ గమ్యం తీరును ప్రస్తావిస్తూ ఈ పోస్టును ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులే దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండడం విశేషం. ఇంతకీ ఎవరా ముఖ్య లీడర్…? ఏమా ‘కప్ప’ కథ…?? దిగువన గల పోస్టును చదివి మీరే అంచనా వేసుకోవాలి మరి.
ఒక కప్పను ఒక నీళ్ళగిన్నెలో ఉంచి ఆ గిన్నెను పొయ్యిమీద ఉంచితే..
కాసేపటికి నీళ్ళు కొంచెం వేడి కావడం మొదలవుతుంది, ఆ నీళ్ళ వేడికి తగ్గట్టుగా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటుంది.
ఇంకొంచెంసేపు తర్వాత నీళ్ళు ఇంకా ఎక్కువ వేడి అవుతాయి, అప్పుడు కూడా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను నీటి వేడికి తగ్గట్టుగా మార్చుకుని నీటి వేడిని ఓర్చుకోగలుగుతుంది.
ఇలా కొన్నిసార్లు జరిగిన తరువాత ఇక నీళ్ళు పూర్తిగా మరిగినంత స్థితికి చేరాక కప్ప తన శరీర ఉష్ణోగ్రతను ఇంక మార్చుకోలేదు, ఇక అప్పుడు కప్ప నిర్ణయించుకుంటుంది, నీళ్ళగిన్నెలోంచి ఇక బయటకు దూకేద్దాము అని…
కానీ దూకలేకపోయింది, ఎందుకంటే అప్పటివరకూ శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటూ నీటి వేడిని భరించటంలోనే కప్ప శక్తి అంతా హరించుకుపోయింది, వేడి నీళ్ళ గిన్నెలోంచీ దూకే శక్తి లేక నీరసపడిపోయింది.
కాసేపటికి కప్ప చనిపోయింది.
కారణం వేడినీళ్ళా…? కానే కాదు.
ఎప్పుడు గిన్నెలోంచి దూకాలో సరైన సమయంలో సరైన నిర్ణయం కప్ప తీసుకోలేకపోయింది..అదే అసలైన కారణం.
మనుషులతో, పరిస్థితులతో సర్దుకుంటూ బతకటం జీవితానికి చాలా అవసరమే.
కానీ శారీరకంగానో, మానసికంగానో, ఆర్ధికంగానో, ఆచారాల పేరుతోనో, నమ్మకాల పేరుతోనో, భావాలపరంగా బలహీనపరుస్తూనో.. ఒకరు లేదా కొందరు మరొకరిని ఇబ్బంది పెడుతుంటే, బాధ పెడుతుంటేనో కొంతకాలం, కొంత హద్దు వరకు భరించినా పరవాలేదు.
కానీ అదే పద్ధతి ఇరువైపులవారికి ఒక మార్చుకోలేని అలవాటుగా మారినప్పుడు… బాధపడేవారు ఎల్లకాలం భరిస్తూ ఉండి బలై పోవడం మంచిది కాదు.
సరైన సమయంలో బాధనుంచి తనను తాను రక్షించుకోవడం , బాధాకర పరిస్థితులకి, బాధపెట్టే మనుషులకు దూరంగా వెళ్ళడం అనేది సహజసిద్ధంగా నేర్చుకోవలసిన ఆత్మరక్షణ.
ఎవరోవస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తూ సమయం ముగిసిపోయేవరకు ఉండి బలయి పోయేకంటే, సమయం ఉన్నప్పుడే కళ్ళు తెరుచుకుని ధైర్యంగా, సరైన శక్తి ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడం అనేది మంచి జీవితానికి చాలా అవసరం.