బరి తెగించి పెద రాయుడిలా తీర్పు చెబుతున్న జర్నలిస్టులకు ఇదో హెచ్చరిక లాంటిది. జర్నలిస్టు ముసుగులో తాము తీర్పరులమని భావించేవారికి చెంపపెట్టు లాంటిది. వార్తను వార్తలాగా నివేదించడమే మీడియా పని. జరిగింది జరిగినట్లు దృశ్య రూపంలో చూపించడం ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి విధి. దాన్ని కళ్లకు కట్టినట్లు రాయడం ప్రింట్ మీడియా జర్నలిస్టు డ్యూటీ. కానీ అనేక సంఘటనల్లో, సందర్భాల్లో కొందరు జర్నలిస్టులు తీర్పులు చెప్పేస్తుంటారు కదా? మీడియాలో చోటు చేసుకున్న ఇటువంటి వికృత పోకడలకు అనేక ఉందంతాలు నిదర్శనంగా ఉన్నాయి.
ఫలానా వాడు దుర్మార్గుడని, దుష్టుడని, నీచుడని, నికృష్డుడని మీడియా తేల్చేస్తుంటుంది. ఇలా జరగాల్సి ఉండేది కాదని, ఫలానా విధంగా జరిగితే బాగుండేదని కూడా నిర్ణయిస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన అదేదో సినిమాలో వెటకారంగా చూపిన దృశ్యాలు జర్నలిస్టుల ప్రవర్తనకు ‘అతి’కినట్లు చూపించారు కూడా. దుర్మరణం చెందిన సినీనటి శ్రీదేవి ఘటనలో బాత్ టబ్బుల్లో పడుకుని ఆమె హైటు, వెయిట్ గురించి చేసిన పాత్రికేయ విన్యాసం గురించి తెలిసిందే. దీన్నే కొందరు జర్నలిస్టులు తమకు మాత్రమే సాధ్యమైన క్రియేటివిటీగా అభివర్ణించుకుంటారనేది వేరే విషయం.
సరే అసలు విషయానికి వద్దాం. జర్నలిస్టులకు సంబంధించి, మీడియా విషయంలో సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు దారి తప్పిన అనేక మంది సోకాల్డ్ జర్నలిస్టులకు గుణపాఠం లాంటివి. ఓ రకంగా హెచ్చరిక కూడా. ‘దిశ’ ఘటనలో మీడియా ప్రసారాలకు సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన నోటీసుల ప్రస్తావన సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మీడియాకు మాట్లాడే హక్కు ఉంటుంది’ అని స్పష్టం చేసింది. కానీ అదే సమయంలో మీడియా ప్రత్యేకించి ‘సదరు వ్యక్తి చేసింది తప్పు’ అని చెప్పేలా ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పేర్కొన్నారు. మీడియాకు మాట్లాడే హక్కు మాత్రమే ఉంది…ఫలానా వ్యక్తి చేసింది తప్పు’ అని తమదైన శైలిలో తీర్పు చెప్పే హక్కు లేదన్న మాట. అంటే… సంఘటనను నివేదించడం వరకే విలేకరి పని. పెద రాయుడిలా తీర్పు చెప్పడం కాదన్న మాట. ఇప్పటికైనా జర్నలిస్టుల్లో కొందరు ‘పెద రాయుళ్ల’కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన హితవు చెవికెక్కుతుందో లేదో చూడాలి మరి.