పాఠాలు చెప్పాల్సిన పంతులమ్మ పోక్సో కేసులో ఇరుక్కుంది. తన స్టూడెంట్, మైనర్ బాలున్ని లేపుకునిపోయి పెళ్లాడింది. బడికెళ్లిన తమ పిల్లోడు కనిపించడం లేదని తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు పసిగట్టేసరికి పంతులమ్మ ప్రేమ పాఠాల బాగోతం బట్టబయలైంది. వివరాల్లోకి వెడితే…
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా కొట్టుయూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ప్లస్ వన్ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థి ఈనెల 5వ తేదీ నుంచి ఆచూకీ లేకుండాపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ పిల్లోడు ఎక్కడికి వెళ్లి ఉంటాడు చెప్మా…? అని పోలీసులు కూపీ లాగుతుండగా అదే స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న షర్మిల (26) కూడా కనిపించడం లేదని తేలింది. పోలీసులకు ఎక్కడో అనుమానం కలిగింది.
దర్యాప్తులో భాగంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా టీచర్ షర్మిల తిరుచ్చి సమీపాన ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ అనుమానం నిజమని ధ్రువపర్చుకుని తేరుకున్నారు. టీచర్ షర్మిలతోపాటు కనిపించకుండాపోయిన 16 మైనర్ బాలుడు కూడా అక్కడే ఉన్నాడు.
పత్తా లేకుండాపోయిన పంతులమ్మ తన పదహారేళ్ల స్టూడెంటును ఓ టెంపుల్ లో పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తిరుచ్చి సమీపంలోని తన స్నేహితురాలి ఇంట్లో స్టూడెంట్ తో ఆశ్రయం పొంది సేద తీరుతున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. మైనర్ బాలున్ని లేపుకుని వెళ్లి పెళ్లి చేసుకున్నందుకు పంతులమ్మ షర్మిలను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.