సర్పంచ్, ఉప సర్పంచ్, వీళ్లిద్దరి భర్తలు కలిసి భారీ మొత్తపు నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. రూపాయి, రెండు రూపాయలు కాదు… ఏకంగా కోటి 27 లక్షల 8 వేల 324 రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు అధికారుల విచారణలో బహిర్గతమైంది. ఓ సాధారణ గ్రామ పంచాయతీలో రూ. కోటికి పైగా నిధులు దుర్వినియోగమైన తీరు తీవ్ర కలకలం కలిగిస్తోంది. అయితే సర్పంచ్, ఉప సర్పంచ్, వీరిద్దరి భర్తలు కూడా అధికార పార్టీకి చెందినవారు కావడంతో కఠిన చర్యలకు అధికారగణం జంకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజాధనం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులను, వారి భర్తలపై ఈగ వాలకుండా ఓ ఎమ్మెల్యేతోపాటు మరో ముఖ్య ప్రజాప్రతినిధి ‘కాపలా’గా ఉన్నట్లు ప్రచారపు సారాంశం. పూర్తి వివరాల్లోకి వెడితే…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జారీ చేసిన షోకాజ్ నోటీసు ప్రకారం బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామ పంచాయతీలో ఈ భారీ మొత్తపు నిధుల దుర్వినియోగం జరిగింది. నిధుల, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు సర్పంచ్ బి. శ్రావణిపై తెలంగాణా పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 37 (1), సెక్షన్ 37 (5)లలోని నియమాల ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలపాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ఇదీ జరిగిన బాగోతం:
జిల్లా కలెక్టర్ జారీ చేసిన షోకాజ్ నోటీసు ప్రకారం… మండల పంచాయతీ అధికారి 2021 జూన్ 18వ తేదీన ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి నివేదిక సమర్పించారు. ఆయా నివేదిక ప్రకారం… సర్పంచ్ బి. శ్రావణి, ఉప సర్పంచ్ వై. ఝాన్సీ లక్ష్మీబాయి, వారి భర్తలు బి. శివకృష్ణ, వై. శివారెడ్డిల పేర్ల మీద నిబంధనలకు విరుద్ధంగా చెక్కులు రాసి, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. సర్పంచ్, ఉప సర్పంచ్ ల భర్తలు గ్రామ పంచాయతీ పరిపాలన అంశాల్లో జోక్యం చేసుకున్నారని నిర్ధారించారు.
సర్పంచ్ శ్రావణి, ఆమె భర్త శివకృష్ణల పేర్ల మీద మొత్తం 66 చెక్కుల ద్వారా రూ. 72,73,612, ఉప సర్పంచ్ ఝాన్సీ లక్ష్మీబాయి, ఆమె భర్త శివారెడ్డిల పేర్ల మీద మొత్తం 50 చెక్కుల ద్వారా రూ. 54,34,712 మొత్తాలను డ్రా చేశారు. విచారణాధికారి నివేదిక ప్రకారం… గ్రామ పంచాయతీలో పారిశుధ్య నిర్వహణకు సంబంధించి 2020 ఏప్రిల్ నుంచి 2021 మే వరకు రూ. 53,89,688 మొత్తాన్ని ఖర్చు చేశారు. అయితే ఇందుకు సంబంధించి ఎక్కువ బిల్లులు సర్పంచ్, ఉప సర్పంచ్, వాళ్ల భర్తల పేర్ల మీద చెక్కులు రాశారు. అంతేగాక చేసిన పనులకన్నా బిల్లులు ఎక్కువ మొత్తంలో డ్రా చేసినట్లు గుర్తించారు. గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్లు 9 మంది ఉన్నప్పటికీ, అవసరానికి మించి పారిశుధ్య సిబ్బందిని నియమించి, అధిక మొత్తంలో బిల్లలు డ్రా చేశారు. గ్రామ పంచాతీని అధికారులు తనిఖీ చేసినపుడు అసలు పారిశుద్య పనులు నిర్వహించినట్లు కూడా కనిపించలేదు. పారిశుధ్య పనుల నిర్వహణ అంశంలో సర్పంచ్, ఉప సర్పంచులు నిర్లక్ష్యం వహించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
సొంత పేర్లపైనే చెక్కులు:
వాస్తవానికి గ్రామ పంచాయతీకి సంబంధించిన చెక్కులు జారీ చేసే సమయంలో చెల్లింపులు వ్యక్తుల పేర్లపై రాయకూడదు. పనులు నిర్వహించిన సంస్థల పేర్లపై మాత్రమే చెక్కుల రూపంలో చెల్లింపులు జరగాలని జీవో ఎంఎస్ నెం. 432/2013 నిర్దేశిస్తోంది. కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ చెక్కులు సర్పంచ్, ఉప సర్పంచ్, వారి భర్తల పేర్లపైనే రాసి, నిధులు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 37 (1) 37 (5)లోని నియమాల ప్రకారం సర్పంచ్ శ్రావణిపై ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అనుదీప్ గత ఫిబ్రవరి 7వ తేదీన షోకాజ్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. షోకాజ్ నోటీసు అందిన మూడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని లేనిపక్షంలో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోక తప్పదని కూడా కలెక్టర్ పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ భారీ మొత్తపు నిధుల దుర్వినియోగంలో మండల పంచాయతీ అధికారి నివేదిక సమర్పించి తొమ్మిది నెలలు దాటింది. నిరుడు జూన్ 18వ తేదీన ఆయన రిపోర్ట్ సమర్పించినట్లు షోకాజ్ నోటీసులోనే ప్రస్తావించారు. పంచాయతీ అధికారి నివేదిక సమర్పించిన ఏడున్నర నెలల తర్వాత గాని నిధుల దుర్వినియోగంపై షోకాజ్ నోటీసులు జారీ కాలేదు. షోకాజ్ నోటీసు జారీ చేసి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేమిటో అధికారికంగా వెల్లడించలేదు.
సర్పంచ్, ఉప సర్పంచ్ లు తమ భర్తలతో కలిసి అధికార, రూ. 1.27 కోట్ల మొత్తపు నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంఘటనలో రాజకీయ జోక్యం వల్లే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. చిన్న చిన్న మొత్తాల నిధుల దుర్వినియోగపు అంశాల్లో ఇతర పార్టీలకు చెందిన సర్పంచులపై కఠిన చర్యలు తీసుకుంటున్న అధికారగణం నాగినేనిప్రోలు ఘటనలో చర్యలకు వెనుకంజ వేయడం వెనుక సహజమైన కారణాలే ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. సర్పంచ్, ఉప సర్పంచులతోపాటు వారి భర్తలు అధికార పార్టీకి చెందినవారు కావడం వల్లే కఠిన చర్యలకు అధికారులు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే, మరో ముఖ్య నేత నిధుల దుర్వినియోగపు అంశంలో జోక్యం చేసుకుని వారిని కాపాడుతున్నారనేది ఆరోపణల సారాంశం.
ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించి జిల్లా కలెక్టర్ జారీ చేసిన షోకాజ్ నోటీసు ప్రతిని దిగువన చూడవచ్చు.
ఫొటో: నాగినేనిప్రోలు గ్రామ పంచాయతీ కార్యాలయం