ఈనెల 31వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు తెరుస్తున్నారా? అని తెలంగాణా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్కూళ్ల ప్రారంభంపై వివరాలు తెలపాలని, ఈనెల 31వ తేదీ నుంచి బడులు తెరుస్తున్నారా? అని హైకోర్టు ఆరా తీసింది.
ఇందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమాధానమిస్తూ స్కూళ్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వీకెండ్ సంతల్లో కరోనా నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అదేవిధంగా మేడారం జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆన్ లైన్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆయన వివరించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని నివేదించారు. తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు.