హన్మకొండ జిల్లా ధర్మసాగర్ తహశీల్దార్ పై బదిలీ వేటు పడింది. ప్రస్తుత ధర్మసాగర్ తహశీల్దార్ సీహెచ్ రాజును పరకాల ఆర్డీవో కార్యాలయంలో డీఏవోగా స్థాన చలనం కలిగిస్తూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వు జారీ చేశారు. పరకాల ఆర్డీవో ఆఫీసులో డీఏవోగా పనిచేస్తున్న ఎం. రజనిని ధర్మసాగర్ తహశీల్దార్ గా నియమించారు.
ధర్మసాగర్ తహశీల్దార్ కార్యాయంలో అనేక అవినీతి, వివాదాస్పద అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తహశీల్దార్ రాజుపై బదిలీ వేటు పడడం గమనార్హం. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో దరఖాస్తు సమయంలోనే పేదల నుంచి ధర్మసాగర్ తహశీల్దార్ వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ వసూళ్లకు పాల్పడిన ధర్మసాగర్ తహశీల్దార్ పేరును ‘రాజ్’ కుమార్ గా విజిలెన్స్ నివేదికలో ప్రస్తావించగా, ఆ పేరు గల అధికారి ఎవరూ ఇక్కడ తహశీల్దార్ గా పనిచేసిన దాఖలాలు లేవు. అంతేగాక వివిధ అంశాల్లో గతంలో ఇక్కడ తహశీల్దార్లుగా పనిచేసిన అధికారులు ఇచ్చిన నివేదికలకు విరుద్ధంగా ప్రస్తుత తహశీల్దార్ రాజు తనదైన శైలిలో విరుద్ధ నివేదికలు సమర్పించడం కూడా తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాజును బదిలీ చేస్తూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఉత్తర్వు జారీ చేయడం విశేషం.