రాజకీయ రంగంలో జరిగే సంఘటనలకుగాని, సన్నివేశాలకుగాని, పరిణామాలకు గాని కేవలం బయటి కారణాలని పరిశీలిస్తే సరిపోదు. వాటికి అంతర్గత, ఉపరితలమనే రెండు కోణాలు ఉంటాయి. బయటి కోణం మాత్రమే సాధారణంగా ప్రాచుర్యం పొందుతుంది. JNU పై ఫాసిస్టు రాజకీయ శక్తుల దాడికి కూడా రెండు కోణాలు విధిగా వుంటాయి.
పై దాడికి బయటకు కనిపించే రూపం లేదా మొఖం అత్యంత దూకుడుతనాన్ని (offensive charectered attack) కలిగి వుంది. దాని అంతర్గత రూపం/మొఖం అత్యంత ఆత్మరక్షణ స్థితిని (deffensive charectered attack) వెల్లడిస్తుంది. పాము బుస కొట్టడం పట్ల ప్రజల్లో సాధారణ అభిప్రాయం వేరు! వాస్తవం వేరు! దాని దూకుడు స్థితికి అది చిహ్నమని ప్రజలు భావిస్తారు. అది నిజం కాదు. పాము అభద్రతా స్థితిలో పడే సమయాల్లో మాత్రమే అది నిజానికి బుస కొడుతుంది. అదే విధంగా ఇంతకాలం ముసుగు ధరించకుండా ఫాసిస్టు శక్తులు ప్రజలపై నగ్నంగా దాడులు చేస్తూ వచ్చాయి. ఇప్పుడు ముసుగు ధరించాల్సి వచ్చింది. అంటే ఫాసిస్టు రాజకీయ శక్తులు ముసుగు లేకుండా తన ఏబీవీపీ మూకని రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడికి ప్రోత్సహించలేక పోవడం గమనార్హం! ఆయా దాడుల్ని లోకంలో సమర్ధించుకునే రాజకీయ స్థితిని క్రమంగా అవి కోల్పోతున్నాయని అర్ధం! రాజకీయ రంగంలో అదో గుణాత్మక మార్పు!
ఫాసిస్టు శక్తులు దేశంలో నగ్నంగా దాడులు చేసే స్థితి నేడు క్రమంగా కోల్పోతున్న స్థితి ఏర్పడుతూ వుంది (ఏర్పడిందని అనడం లేదు, ఆ ప్రక్రియ ప్రారంభమైందని అంటున్నా) సదరు నగ్నమైన తమ దాడుల్ని సమర్ధించుకునే స్థితిని అవి క్రమంగా కోల్పోతున్నాయని కూడా అర్ధమౌతుంది. ఇంత కాలం హిందుత్వ బూచితో పౌర సమాజంలో ఫాసిస్టు శక్తులు విస్తరించిన చొరబాటు సామర్ధ్యాన్ని అవి క్రమంగా కోల్పోతున్నాయని కూడా అర్ధం! పైకి అత్యంత దూకుడు దాడిగా ఉపరితల చూపులో కనిపించవచ్చు. కానీ అంతర్గత చూపుతో చూస్తే, రాజకీయంగా ఫాసిస్టు శక్తుల వెనుకంజ స్థితిని మాత్రమే వెల్లడిస్తుంది.
మోడీ-షా ప్రభుత్వం గత ఏడు నెలల్లో అంతర్జాతీయ రంగంలో ఎగుడు దిగుళ్ళతో కూడిన వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చింది. అమెరికా, రష్యా, చైనా… వీటి పట్ల కుడి ఎడమలకి వంగుతూ తన వైఖర్లు ప్రదర్శిస్తూ వచ్చిన ఓ గతం కూడా వుంది. ఏది ఏమైనా అమెరికాతోనే దాని ప్రాథమిక బంధం! ‘హౌడీ మోడీ’ ప్రోగ్రాం తో బరితెగించి బ్రహ్మముడి వేసుకుంది. ట్రంప్ సర్కారు తో ఏర్పడ్డ అసహజ, అసాధారణ అనుబంధం నేడు ఇరకాటంలో వేస్తోంది. ట్రంప్ పాలనా వ్యవస్థ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్ లలో… వరసగా దెబ్బతిని, చివరకు బాగ్దాద్ లో నేడు ఘోరంగా భంగపడుతున్న వేళ యిది. మోడీ-షా సర్కారు కి అంతర్జాతీయ యజమాని (International master) దగ్ధ బాగ్దాద్ (Burning Bagdhad) లో ‘గో బాక్’ అనిపించుకునే స్థితిలో పడింది. అమెరికా శనివారం బాగ్దాద్ లో చేసిన దాడి లో ఇరాన్ సైనికాధికారి మృతితో మధ్య ప్రాచ్యంలో అది మరింత ఊబిలో పడింది. అది అభద్రతలో పడితే, దాన్ని నమ్ముకున్న మెడీ-షా సర్కార్ కూడా ఆచరణలో అభద్రతలో కూరుకొని పోతున్నట్లే! ఆయా అభద్రతా స్థితి సృష్టించే భయం నుండి కూడా ఇలాంటి ‘ముసుగు దాడులు’ చేయాల్సిన స్థితి ఫాసిస్టు రాజకీయ శక్తులకు ఏర్పడి వుండొచ్చు. ఈ లోపలి కోణాన్ని కూడా గమనంలో ఉంచుకోవాల్సి వుంటుంది.
సైనిక దౌత్య నీతిలో first offense is best deffense అనే ఎత్తుగడ వుంది. అంటే తాను దెబ్బ తింటున్న స్థితిని గుర్తించిన దుర్బలుడు తన ప్రత్యర్థిపై ముందే ఎదురుదాడికి దిగుతాడని అర్ధం! JNU పై ఫాసిస్టు శక్తుల ముసుగు దాడి లో ఆయా ఎత్తుగడ కనిపిస్తోంది.
ముస్లిం బూచిని చూపించి హిందువుల మెదళ్లని నెమ్మది గా విషపూరితం చేసే (slow poisonous) హిందుత్వ రాజకీయ శక్తుల రసాయనిక ప్రక్రియ ఇంతకాలం ఫాసిస్టు శక్తులు సంతృప్తికరంగా సాగింది. దానికి క్రమంగా కాలం చెల్లుతోంది (కాలం చెల్లిందని అనడం లేదు, చెల్లుతూ వుంది) గత కొన్ని వారాలలో దేశంలో భౌతిక, రాజకీయ పరిస్థితుల్లో ఓ మార్పు కనిపిస్తోంది. అది క్రమంగా రూపు దిద్దుకుంటోంది. (మార్పు వచ్చిందనడం లేదు. క్రమంగా మార్పు ప్రారంభమైన స్థితిని మాత్రమే చెబుతున్నా) ఇది రేపటి ఉద్యమాల పంటకు అవసరమైన చినుకు మాత్రమే! ఈ తొలకరి జల్లులు చూసి పంటల విధ్వంసక శక్తులు ఖంగు తింటున్నాయి. ఆయా కొత్త భౌతిక స్థితిని భరించలేని ఒక మానసిక స్థితికి నేడు మోడీ-షా ప్రభుత్వం క్రమంగా గురవుతూ వుండొచ్చు. దాని నుండి ఒక ‘ముసుగు’ ధరించాల్సి వచ్చి వుండొచ్చు.
గత ఆదివారం JNU పై ముసుగు దాడి రాజకీయ దూకుడు స్థితిలో చేసిందని భావించరాదు. రాజకీయంగా అది భయపెట్టే లక్ష్యంతో చేసిన దాడి కాదని తెలిగ్గానే అర్ధమౌతుంది. నేడు ఫాసిస్టు శక్తులు కొత్తగా భయ స్థితికి గురవుతున్న కొత్త భౌతిక స్థితి ఏర్పడుతోంది. ఆయా స్థితిలో JNU పై జరిగిన దాడిగా భావించవచ్చు.
–✍ ఇఫ్టూ ప్రసాద్