పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ ఆత్మహత్యోదంతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ అరెస్టయ్యాడనే అంశంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. వనమా రాఘవను హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లు ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియా సైతం వార్తా కథనాలను నివేదించింది. తన కుమారుని వ్యవహరంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖను విడుదల చేసిన నేపథ్యంలోనే వనమా రాఘవ అరెస్టయినట్లు వార్తలు వచ్చాయి. కొత్తగూడెం పోలీసులే రాఘవను అరెస్ట్ చేసినట్లు ప్రచురితమైన వార్తల సారాంశం
అయితే వనమా రాఘవను తాము అరెస్ట్ చేయలేదని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించడం విశేషం. ఏడెనిమిది పోలీసు టీమ్ లతో తాము రాఘవ కోసం గాలిస్తున్నామని, అతను దొరకడం లేదని ఏఎస్పీ ప్రకటించడం గమనార్హం. వనమా రాఘవ దొరికితే తాము అరెస్ట్ చేస్తామని, గతంలో నమోదైన కేసులు ప్రామాణికంగా రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తామని ఏఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు.
ఆయా పరిణామాల్లో అసలు వనమా రాఘవ ఎక్కడున్నాడు? రాఘవను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రచారం ఎందుకు జరిగింది. ఈ ప్రచారం వెనుక గల కారణాలేమిటి? ప్రచారం చేసిన వ్యక్తులు ఆశించిందేమిటి? ఘటన జరిగి రోజులు గడుస్తున్నా రాఘవ ఆచూకీని పోలీసుల ఛేదించలేకపోతున్నారా? పోలీసుల కళ్లు గప్పి రాఘవ ఎక్కడ తిరుగుతున్నాడు? ఇవీ ఇప్పటికిప్పుడు జవాబు లేని ప్రశ్నలు. వనమా రాఘవ ఉదంతం మరెన్ని పరిణామాలను దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.