కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ రావు ‘సెల్ఫీ’ వీడియోను విడుదల చేయడం ద్వారా ఓ కుటుంబం ఆత్మహత్యా ఘటనలో వచ్చిన ఆరోపణల్లో అడ్మిట్ అయ్యాడా? సెటిల్మెంట్లుగా ప్రాచుర్యం పొందిన ‘పంచాయతీలు’ తాను చేస్తున్నట్లు అంగీకరించినట్లేనా? తండ్రికి బదులుగా తానే డిఫాక్టో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నట్లు అతను ఒప్పుకున్నట్లేనా? ఇవీ తాజా ప్రశ్నలు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యోదంతంలో వనమా రాఘవేంద్రరావుపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సంఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం కొత్తగూడెం నుంచి పరారీ అయి, ఎక్కడో గుర్తు తెలియని ప్రదేశం నుంచి ‘సెల్ఫీ వీడియో’ను విడుదల చేసిన వనమా రాఘవేందర్ రావు ఇంతకీ ఏమంటున్నారో దిగువన గల వీడియోలో ఓసారి నిశితంగా చూద్దాం.
చూశారు కదా వీడియో…? పాత పాల్వంచకు చెందిన రామకృష్ణ ఆత్మహత్యకు, తనకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. తనకు ఎటువంటి జోక్యం లేదంటున్నారు. వాళ్లందరూ తనకు తెలిసనవారేనని చెప్పారు. అమ్మకు మంచి చేయరా.. అమ్మకి న్యాయం చేయాలని చెప్పినందుకు, తనపై ఎందుకు రాశాడో తనకు అర్థం కావడం లేదన్నారు. తమది రాజకీయ కుటుంబంగా చెప్పారు. తమ ఇంటి వద్దకు వందల మంది సవాలక్ష పనుల కోసం వస్తుంటారన్నారు. కావాలని, కుట్రతోని కొంత మంది రామకృష్ణను ప్రలోభపెట్టి తనను ఇరికించేందుకు ప్రయత్నం చేశారన్నారు. తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు చేసిన కుట్రలో భాగంగా అభివర్ణించారు. తమ ఇంటి వద్దకు వందల మంది, సవాలక్ష పనులకోసం వస్తుంటారని, చేస్తా ఉంటామని. ఎవరికి న్యాయం జరగకపోతే నేను బాధ్యుడినా? ఎటువంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, తన ప్రమేయం ఉంటే తాను శిక్షను అనుభవిస్తా’నని వనమా రాఘవేందర్ రావు పేర్కొన్నారు. వీడియోలో రాఘవేందర్ రావు చెప్పిన మొత్తం వ్యాఖ్యల సారాంశమిది.
ఇక అసలు విషయంలోకి వెడితే… ‘చనిపోయే వ్యక్తుల నాలుక మీద నిజమే తప్ప అబద్ధం ఉండదు. ఎవరిపైనా పగ ఉండదు’ అనేది సుప్రీంకోర్టు అనేక కేసుల్లో తీర్పు సందర్భంగా వ్యక్తం చేసిన భావన. ‘డెత్ డిక్లరేషన్’కు దేశ అత్యున్నత న్యాయ స్థానం చెప్పిన అసలు సిసలు నిర్వచనం. ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణ తన సూసైడ్ లేఖలో చెప్పిందేమిటి? ‘తన కుటుంబ చావుకి వనమా రాఘవేందర్ కారణం’ అని స్పష్టంగా పేర్కొన్నారు. మరో ఇద్దరు వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించారు. ఈ ఘటనలో పోలీసులు రాఘవేందర్ రావుపై కేసు కూడా నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో వనమా రాఘవేందర్ రావు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలోని అనేక వ్యాఖ్యలు పలు ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. అవేమిటంటే… రామకృష్ణ కుటుంబానికి సంబంధించిన పంచాయతీలో తాను జోక్యం చేసుకున్నట్లు రాఘవేందర్ రావు అంగీకరించారు. అసలు పంచాయతీలు చేసే హక్కు రాఘవేందర్ రావుకు ఎవరిచ్చారు? అనేది అసలు ప్రశ్న. తమ ఇంటి వద్దకు వందల మంది వస్తుంటారని, సవాలక్ష పనుల కోసం వీళ్లంతా వస్తుంటారని, ఎవరికి న్యాయం జరగకపోతే తాను బాధ్యుడినా? అని రాఘవేందర్ రావు ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి ప్రజా ప్రతినిధులు ‘సమస్యల స్వీకరణకర్తలు’ మాత్రమే. ‘పరిష్కారకర్తలు’ కాదు. సమస్యలను స్వీకరించి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారినికి పాటుపడాలే తప్ప, పంచాయతీలు నిర్వహించడం ప్రజాప్రతినిధుల హక్కు కాదు. అసలు ప్రైవేట్ పంచాయతీలు నిర్వహించరాదని, వివాదాలను పరిష్కరించడానికి న్యాయస్థానాలు ఉన్నాయని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టం చేశాయి.
కానీ వనమా రాఘవేందర్ రావు ఏ హోదాలో పంచాయతీలు నిర్వహిస్తున్నారు? ఇదీ అసలైన సందేహం. ఎందుకంటే ఆయన ఎటువంటి ప్రజాప్రతినిధి హోదాలో లేడు. కనీసం ఓ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు కూడా కాదు. పోనీ పార్టీపరంగా ఏదన్నా హోదా ఉందా? అంటే… అదీ లేదు. ‘టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు’ అని మాత్రం మీడియాలో వార్తలు వస్తుంటాయి. అటు ప్రజాప్రతినిధి కాకుండా, ఇటు పార్టీ నాయకుడు కాకుండా ఏ హోదాలో పంచాయతీలు నిర్వహిస్తున్నాడు? ఏదేని హోదా ఉన్నప్పటికీ పంచాయతీలు చేసే హక్కు ఉందా? ఇవేవీ లేకుండా ఏ ప్రాతిపదికన తమ ఇంటికి వచ్చే ప్రజలను నిర్దేశిస్తున్నాడు? పంచాయతీలు చేపేందుకు గల వనమా రాఘవేందర్ కు గల స్థాయి ఏమిటి? ఇవీ ప్రశ్నలే.
తమది రాజకీయ కుటుంబమని, తన తండ్రి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని కూడా రాఘవేందర్ రావు పేర్కొన్నారు. నిజమే… కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర్ రావు మాత్రమే ఉన్నారు. కానీ తన తండ్రికి గల ‘ఎమ్మెల్యే’ అధికారాన్ని రాఘవేందర్ బదలాయించుకున్నారా? తండ్రి నిర్వహించాల్సిన ప్రజా సమస్యల స్వీకరణ బాధ్యతను తనయుడు రాఘవేందర్ ఎందుకు చేపడుతున్నట్లు? అంటే… డి ఫాక్టో ఎమ్మెల్యేగా తాను వ్యవహరిస్తున్నట్లు రాఘవేందర్ తన సెల్ఫీ వీడియోలో అంగీకరించినట్లేనా? ఇదే నిజమైతే దీనికి చట్టబద్ధత ఉన్నట్లేనా? ఇవి కూడా ప్రశ్నలే.
ఇదిలా ఉంటే… నిజానికి రామకృష్ణ కుటుంబం ఘటనతో తనకు ఏ ప్రమేయం లేకుంటే, ఆరోపణలు రావడం, కేసు నమోదైన నేపథ్యంలో వనమా రాఘవేందర్ రావు చట్టం ముందు ఎందుకు లొంగిపోలేదు? ఆ తర్వాత బెయిల్ తీసుకుని తన ప్రమేయం లేనట్లు న్యాయస్థానంలో నిరూపించుకోవచ్చు కదా? అజ్ఞాతంలోకి వెళ్లి మాట్లాడడమేంటి? కేసులో ఇన్వెస్టిగేషన్ ను తప్పుదోవ పట్టించే యత్నమా? అనే సందేహాలు కూడా ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.
మొత్తంగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యోదంతంలో తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని కోర్టులో తేల్చుకునే పూర్తి బాధ్యత రాఘవేందర్ రావుదేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో రాఘవేందర్ రావు ‘పరారీ’లో ఉండడం ‘స్ట్రాంగ్ ఎవిడెన్స్’గానూ న్యాయవాద వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా వనమా రాఘవేందర్ రావు నిర్వహించే ‘పంచాయతీ’ వ్యవహారాలకు రామకృష్ణ కుటుంబం ఎందుకు బలి కావాలి? అనేది అసలు ప్రశ్న. పరారీ కావడ ద్వారా సెల్ఫీ వీడియోను విడుదల చేసిన వనమా రాఘవేందర్ రావు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో వచ్చిన ఆరోపణల్లో తనకు తాను ‘అడ్మిట్’ అయినట్లుగా న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.