‘‘ఏసీబీ అధికారులు గిట్ల దాడులు చేస్తరా? ‘రెవెన్యూ’ అధికారుల, సిబ్బంది మనోభావాలు దెబ్బ తినవా? ఎవరో బ్రోకర్… అంటే మధ్యవర్తి అన్నమాట… ఆర్డీవో పేరు చెప్పి రూ. లక్ష లంచంగా తీసుకుంటే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారికి ఏం సంబంధం? ఏసీబీ అధికారులకు రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఒక్కటే కనిపిస్తున్నదా? మరే ఇతర డిపార్ట్ మెంట్ కనిపించడం లేదా? ఇలాంటి దాడుల ద్వారా రెవెన్యూ అధికారుల, ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాదా? ఇది కరెక్ట్ కాదు… రెవెన్యూ వాళ్లు 24 గంటలు ప్రతి పని చేస్తూంటే… ఇటువంటి దాడులు చేయడం మంచిది కాదు. ఈ విషయంలో రెవెన్యూ యూనియన్లకు చెందిన పెద్దన్నలు, చిన్నన్నలు కలిసి సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఆర్డీవోపై ఏసీబీ అధికారులు దాడి చేసిన ఘటనను ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ, ఏసీబీ దృష్టికి తీసుకెళ్లాల్సిందేని అంటున్నారు. న్యాయం జరిగేందుకు భరోసా తీసుకోవలసిందేనని ప్రతిన పూనుతున్నారు. ఇటువంటి ఏసీబీ దాడులకు ఎవరూ అధైర్య పడాల్సి అవసరం లేదని భరోసా కల్పిస్తున్నారు.’’
ఏమిటీ ఈ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా? నిన్నటి ఏసీబీ దాడి ఘటన గురించి తెలుసు కదా? పెద్దపల్లి ఆర్డీవో, రామగుండం మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ శంకర్ కుమార్ ఓ మధ్యవర్తి ద్వారా కాంట్రాక్టర్ రజనీకాంత్ నుంచి రూ. లక్ష మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. ఇదిగో ఈ నేపథ్యంలోనే ‘అల్లిన’ ఓ చిన్నపాటి ఉపోద్ఘాతం అన్నమాట. ఎందుకీ ‘కత’లాంటి ఉపోద్ఘాతం అంటే…
ఆ మధ్య రెవెన్యూ శాఖకు చెందిన 43 మంది తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు, వీఆర్వోలు, వీఆర్ ఏలు తదితరులు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో ‘కక్కుర్తి’ పడినట్లు విజిలెన్స్ విభాగం ఓ నివేదికను రూపొందించిన సంగతి తెలిసిందే. ఆయా పథకాల్లో రెవెన్యూ శాఖకు చెందిన 43 మంది అధికారులు, సిబ్బంది రూ. వెయ్యి నుంచి రూ. 10 వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారుల నుంచి వసూళ్ల దందా కోసం పలువురు ప్రజాప్రతినిధులను, అధికార పార్టీ నాయకులను, కార్యకర్తలను, రెవెన్యూ సిబ్బందిని కూడా బ్రోకర్లుగా నియమించుకున్నట్లు విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా ఉంది. ఈ అక్రమ వసూళ్లకు పాల్పడిన అధికారుల పేర్లను ఉటంకిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సిఫారసు చేయగా, వెంటనే చర్యలు తీసుకుని తనకు నివేదించాలని హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
దాదాపు ఆరు నెలలుగా కావస్తున్నా విజిలెన్స్ నివేదికలో ప్రస్తావించిన 43 మంది అధికారులపై, సిబ్బందిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అదే శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. విజిలెన్స్ నివేదిక బహిర్గతమైన నేపథ్యంలో… సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ పోస్ట్ కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తోంది. విషయమేమిటంటే అసలు విజిలెన్స్ నివేదికనే తప్పు పట్టడం ఈ పోస్టులోని అసలు సారాంశం. ఆయా పోస్టును ఉన్నది ఉన్నట్లుగానే దిగువన చదివాక తొలి పేరా ఉపోద్ఘాతం ఎందుకు రాయల్సి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఆర్డీవోపై ఏసీబీ అధికారులు దాడి చేయడంపైనా ‘రెవెన్యూ’ యూనియన్లు, వాటి నాయకులు కొందరు స్పందించే అవకాశం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదీ అసలు సంగతి. ఇక ‘రెవెన్యూ మనోభావాల పోస్ట్’ను చదివేయండి.
రెవిన్యూ మిత్రులకు అందరికి నమస్కారం
గత కొద్దిరోజులుగా కళ్యాణ లక్ష్మీ, మరియు షాది ముబారక్ నందు రెవిన్యూ అధికారులు, ఉద్యోగులు బ్రోకర్లను పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నారని రెవిన్యూ విజిలన్స్ వింగ్ సెక్షన్ నుండి ఒక అణముఖీని దరఖాస్తు మేరకు కలెక్టర్లకు నివేదిక పపండం జరిగినది….
** కానీ **
1) ఇట్టి అపవాదు వందకు వందశాతం అబద్ధం అని చాలా స్పష్టంగా తెలుస్తుంది.
2)విజిలెన్స్ సెక్షన్ వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం బ్రోకర్లు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నందు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పినారు.
3)కానీ అట్టి బ్రోకర్లు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నందు తాహసిల్దార్ కు మరియు తహసిల్దార్ కార్యాలయంలోని సిoబ్బదికి డబ్బులు ఇవ్వాలని తీసుకుంటే, తహసిల్దార్ కు మరియు కార్యాలయానికి సిబ్బంది కి ఏమి సంబంధం ఉన్నది, //కొంత మంది బ్రోకర్లు మన పేరుచెప్పు కొని పబ్బం గడుపుతున్నారు//
3)మన రెవెన్యూ ఉద్యోగస్తులు 24 గంటలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వివిధ పనులను కష్టపడి ప్రతి ఎంక్వైరీ కంప్లీట్ చేసి నివేదికలు మంజూరు మరియు ప్రతిపాదనలు పై అధికారులకు పంపిస్తున్నాము….
4)విజిలన్స్ విచారణ రెవిన్యూ డిపార్ట్మెంట్ ఒకరేకే మాత్రమేనా వేరే డిపార్ట్మెంట్ కు లేదా.. ఇలా తప్పుడు నివేదిక వలన ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తీసేందుకు ప్రాత్నం చేసున్నారు ఇది కరెక్ట్ కాదు మేము 24 గంటలు ప్రతి పని చేస్తూ ఇట్టు వంటి నిందనలు చేయడం మంచిది కాదు.
ఇట్టి విషయంలో మన ఉమ్మడి జిల్లా కన్వీనర్ శ్రీ జి రాజ్ కుమార్, మరియు నేను (రియాజ్) మన రాష్ట్ర అధ్యక్షుడు మన పెద్దన్న శ్రీ వంగ రవీందర్ రెడ్డి గారితో కళ్యాణ లక్ష్మీ, మరియు షాది ముబారక్ రెవిన్యూ విజిలన్స్ విషయం చాలా క్లుప్తంగా మాట్లాడడం జరిగింది, శ్రీ వంగా రవీందర్ రెడ్డి మన రాష్ట్ర అధ్యక్షులు ఇట్టి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి చీఫ్ సెక్రెటరీ గారికి మరియు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చి న్యాయం చేస్తాం అని భరోసా /హామి ఇచ్చినారు….. మరియు ఎవ్వరూ కూడా అధైర్యం పడొద్దని ధైర్యం చెప్పారు.
నోట్:-
కొంతమంది సభ్యులు సంఘం ఎమి చేసిందని సంఘం మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తోతున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా సంఘం మనకేం చేసింది కాదు సంఘానికి మనం ఏం చేసింది అని కూడా మన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది???
జై ట్రెస✊ జై జై ట్రెస✊✊….