తెలంగాణా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్లాల్లో తెలంగాణా రైతు కన్నీరు కారుస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీలో సేద తీరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన బీజేపీ, టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా అభివర్ణించారు. ఇటువంటి తీర్థ యాత్రలతో తెలంగాణా రైతాంగానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నారు. అయినా వానాకాలం పంట కొనుగోలు చేయకుండా యాసంగి పంట గురించి ఇప్పుడు పంచాయతీ ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణా రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. ఈమేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తల, పోలీసుల వ్యవహార శైలిపైనా రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. నగరం నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్ పత్రాలను టీఆర్ఎస్ గూండాలు చించేస్తుంటే చూస్తూ ఉన్న పోలీసులు రక్షక భటులా? కేసీఆర్ కు బానిసలా? ఇక్కడ అమలయ్యేది భారత రాజ్యాంగమా? కల్వకుంట్ల రాజ్యాంగమా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయా ట్వీట్ ను దిగువన చూడవచ్చు.