ఖమ్మం నగరంలో కండల వీరులు మళ్లీ సందడి చేయబోతున్నారు. ప్రతిష్టాత్మక బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడంలో తరచూ ప్రత్యేకతను చాటే ప్రముఖ న్యాయవాది, నేషనల్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ వైఎస్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్ ఈసారి కూడా అదే తరహా పోటీల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి సీనియర్ బాడీ బిల్డింగ్ పోటీలను ‘మిస్టర్ ఇండియా – 2022 ఛాంపియన్ షిప్’ నిర్వహణకు ఖమ్మం నగరాన్ని వేదికగా ఎంచుకోవడం విశేషం.
వచ్చే జనవరి 6, 7, 8 తేదీల్లో మిస్టర్ ఇండియా -2022 బాడీ బిల్డింగ్ పోటీలను ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు స్వామి రమేష్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. భారీ నిర్వహణా వ్యయంతో చేపడుతున్న పోటీలను ప్రతిష్టాత్మకంగా స్వీకరించినట్లు చెప్పారు. రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్ల కోసం కమిటీలు కూడా నియమించినట్లు చెప్పారు.
మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ పోటీలకు హాజరయ్యే ప్రతి క్రీఢాకారునికి రోజుకు రూ. 2,500 మొత్తం వ్యయంతో పౌష్టికాహారాన్ని అందించనున్నట్లు చెప్పారు. బాడీ బిల్డర్లతోపాటు అధికారులకు, కోచ్ లకు నగరంలోని ముఖ్య లాడ్జీల్లో వసతి, సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ పోటీలను గడచిన సంవత్సరమే ఖమ్మంలో నిర్వహించాల్సి ఉందని, అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసినట్లు స్వామి రమేష్ కుమార్ చెప్పారు.
ప్రతిష్టాత్మక మిస్టర్ ఇండియా-2022 ఛాంపియన్ షిప్ బాడీ బిల్డింగ్ పోటీలకు ముగ్గురు అర్జున అవార్డు గ్రహీతలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రేమ్ చంద్ డోగ్రా సహా దేశం నలు మూలల నుంచి జాతీయ, అంతర్జాతీయ బాడీ బిల్డర్లు, మిస్టర్ వరల్డ్ గా నిలిచిన టాప్ బాడీ బిల్డర్లు కలుపుకుని దాదాపు 500 మంది వరకు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో తమ సత్తా చాటిన బాడీ బిల్డర్లను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.
ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ గార్డెన్స్ లో నిర్వహించే ఈ పోటీలను వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కోడలు కల్పానరెడ్డి స్మారకార్థం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం నగర ప్రతిష్టను మరింత ఇనుమడింపేజేసే మిస్టర్ ఇండియా – 2022 బాడీ బిల్డింగ్ జాతీయ స్థాయి పోటీల విజయవంతానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని ఆశిస్తున్నట్లు స్వామి రమేష్ కుమార్ పేర్కొన్నారు.