ప్రముఖ తెలుగు మీడియా సంస్థ అధినేతకు తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభిమానులు వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు మంత్రి అభిమానుల పేరుతో ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. తమ నేతపై తప్పుడు ప్రచారం మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘జనంలో ఉండి జనం కోసం పనిచేసేవారి మీదనే మీ ఏడుపులు ఎందుకండీ? మీరు వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. మా పువ్వాడ అజయ్ అన్న సైన్యం గురించి తెలిసీ ఎందుకు గోక్కుంటారు? మీరు ఎవరి మోచేతి నీళ్లు తాగి ఇలా చేస్తున్నారో తెలుసు’ అంటూ ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్టీవీ అధినేత తుమ్మల నరేంద్ర పేరును ఉటంకిస్తూ పువ్వాడ అభిమానులు ట్విట్టర్ ద్వారా కూడా వ్యాఖ్యానించారు. ‘మంత్రి పువ్వాడ అభిమానులు’ పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆయా లేఖ సారాంశం ఇలా ఉంది.
‘‘పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఆస్పత్రి స్థాపించిన 3 దశాబ్దాల నుంచి పేదలకు వైద్యం అందిస్తూ ప్రజల మన్ననలు పొంది.. 2014, 2018 లో ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి, 2019లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి జననేత గా ప్రజలు కీర్తిస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ గారిపై మీరు, మీ ఎన్టీవీ ఛానల్ లో గత రెండు నెలల నుంచి నిరాధార ఆరోపణలతో చేస్తున్న తప్పుడు ప్రసారాంను తీవ్రంగా ఖండిస్తున్నాం.
భారత ప్రజాస్వామ్య సౌధానికి శాసన వ్యవస్థ, కార్యనిర్వాహకవ్యవస్థ, న్యాయవ్యవస్థ మూడు ప్రధాన మూల స్తంభాలు. ఫోర్త్ ఎస్టేట్‌గా పిలుచుకునే మీడియాది కూడా ప్రధానమైన భూమికే. నిజానికి ఈ అన్నివ్యవస్థలను నడిపించే స్టేక్ హోల్డర్స్ అయిన ప్రజలది అతి ముఖ్యమైన భూమిక. అలాంటి ప్రజల మన్ననలు పొందిన నాయకుడుపైన మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీది మీడియా సంస్థా లేక రాజకీయ పార్టీనా? మంత్రి పువ్వాడ అజయ్ గారు చేసే మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేయరు కానీ విపక్ష నేతలు లాగానే మీ అక్కసును, పైత్యాన్ని, దుగ్ధను వెళ్ళగక్కారు. తాజాగా మరో ‘ఆఫ్ ది రికార్డ్’లో వండి వార్చారు. ఇదేమి నీతిబాహ్యత, ఇదేమీ మీడియా స్వేచ్ఛ? ఇలాంటివి మరోమారు పునరావృతం కాకుండా ఉండేలా మీ ఛానెల్ యాజమాన్యం చూసుకుంటారని, లేనిపక్షంలో న్యాయపరంగా, చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతామని తెలియజేస్తూ, ఇకనైనా తప్పుడు కథనాలు ప్రసారం చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాం.’