పేదింటి కుటుంబాల్లో జరిగే పెళ్లి వేడుకల్లో సంతోషాన్ని నింపడానికి మాత్రమే ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన నిరుపేద యువతుల వివాహాల కోసం లక్షా 16 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంలోనూ రెవెన్యూ అధికారులు కొందరు బ్రోకర్లను నియమించుకుని అక్రమ వసూళ్లకు తెగబడడమే అసలు విషాదం. తెలంగాణాలోని 10 జిల్లాలకు చెందిన 43 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది పేదలను ఏ విధంగా దోచుకున్నదీ విజిలెన్స్ విభాగం తన నివేదికలో స్పష్టంగా వివరించింది.
తీగ లాగితే డొంక కదలిన చందంగా ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఈ వసూళ్ల బాగోతాన్ని బహిర్గతం చేసింది. ఆదిలాబాద్ ఆర్డీవో ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం దరఖాస్తుల ప్రక్రియలో రూ. 86.09 లక్షల మొత్తం దుర్వినియోగానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో గుడి హత్నూర్ పోలీస్ స్టేషన్ లో క్రైం నెం. 148/2020 కింద నిందితునిపై ఐపీసీ 420, 403, 409 సెక్షన్ల కిందనేగాక, ఐటీ యాక్ట్ 66 కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి విజిలెన్స్ విభాగం విచారణ జరపగా నివ్వెరపోయే అంశాలు వెల్లడయ్యాయి.
విజిలెన్స్ నివేదిక ప్రకారమే ఉదాహరణగా వరంగల్ అర్బన్ (ప్రస్తుత హనుమకొండ) జిల్లా ధర్మసాగర్ తహశీల్దార్ ఆఫీసు కేంద్రంగా జరిగిన అవినీతి బాగోతాన్ని పరిశీలిస్తే… ఇక్కడి తహశీల్దార్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా భారీ ఎత్తున లంచాలు స్వీకరించినట్లు విజిలెన్స్ నివేదిక పేర్కొంది. ఇందుకోసం తహశీల్దార్ కొందరు ప్రజాప్రతినిధులను, ఇతరులను బ్రోకర్లుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడినట్లు ఆయా నివేదికలో స్పష్టంగా ఉంది. తహశీల్దార్ లంచాల బాగోతపు వసూళ్లలో మాజీ ఎంపీపీ గుడి వెనుక దేవేందర్, నారాయణగిరి సర్పంచ్ కర్ర సోమిరెడ్డితోపాటు సోంపల్లి కరుణాకర్ ప్రమేయమున్నట్లు విజిలెన్స్ నివేదికలో ఉటంకించడం విశేషం.
ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మొత్తం 43 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారుల దరఖాస్తు ప్రక్రియలో లంచాల రూపంలో వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ నివేదిక వివరించింది. దరఖాస్తుదారుల నుంచి రూ. వెయ్యి నుంచి పది వేల వరకు వసూళ్లు చేసినట్లు కూడా ప్రస్తావించింది.
ఇంతకీ ఎవరీ వసూల్ ‘రాజ్’ కుమార్?
రాష్ట్ర వ్యాప్తంగా లంచాల రూపంలో అక్రమ వసూళ్లకు పాల్పడిన 43 మంది రెవెన్యూ సిబ్బందిలో తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, వీఆర్వోలు, వీఆర్ ఏలు ఉన్నట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది. అయితే వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ తహశీల్దార్ గా విజిలెన్స్ జాబితాలో తొలిపేరుగా ప్రస్తావించిన ఎం. రాజ్ కుమార్ ఎవరనే అంశంపై రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ పేరుతో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేస్తున్న కాలం నుంచి, అంటే గడచిన ఏడేళ్ల కాలంలో రాజ్ కుమార్ అనే పేరుగల అధికారి ఎవరూ ఇక్కడ తహశీల్దార్ గా పనిచేసిన దాఖలాలు లేవు. గత కొంత కాలంగా సీహెచ్ రాజు అనే అధికారి మాత్రమే ఇక్కడ తహశీల్దార్ గా పనిచేస్తుండడ గమనార్హం. పథకం కోసం దరఖాస్తు సమర్పణ సమయంలోనే ధర్మసాగర్ తహశీల్దార్ ‘రాజ్’ కుమార్ లంచాలు స్వీకరించినట్లు విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.
వాస్తవానికి విజిలెన్స్ నివేదిక ప్రకారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో లబ్ధిదారుల నుంచి లంచాలు వసూల్ చేసిన ఇటువంటి 43 మంది అవినీతి ‘రాజ్’లపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని గత జూన్ 19వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. కానీ అనేక జిల్లాల కలెక్టరేట్లో ఈ ఉత్తర్వును తొక్కిపెట్టారనే విమర్శలు ఉన్నాయి. లంచావతారాలపై చర్యలు తీసుకుని నివేదిక పంపాలని ప్రభుత్వం ఆదేవించి నాలుగు నెలలు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆయా పది జిల్లాల కలెక్టర్లు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై స్పష్టత లేకపోవడమే ఈ లంచాల బాగోతంలో కొసమెరుపు.