నమ్మక ద్రోహం, అత్యాచారం, బెదిరింపులు తదితర అభియోగాలపై ఓ లిక్కర్ డాన్ పుత్ర రత్నంపై వరంగల్ పోలీసులు నమోదు చేసిన కేసు తీవ్ర సంచలనం కలిగిస్తోంది. వరంగల్ మహానగరంలోని మిల్స్ కాలనీకి చెందిన లిక్కర్ డాన్ కుమారుని ‘కత’లపై బాధిత యువతి మహిళా కమిషన్ ను ఆశ్రయించడం గమనార్హం. ఆరోపణలు ఎదుర్కుంటున్న లిక్కర్ డాన్ కుమారునికి పలువురు పోలీసు అధికారులతో సత్సంబంధాలు ఉండడం వల్లే బాధిత యువతి మహిళా కమిషన్ ను ఆశ్రయించినట్లు వస్తున్న వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
లిక్కర్ డాన్ పుత్రరత్నం కార్యకలాపాలు, అతనితో సన్నిహిత సంబంధాలపై పలువురు పోలీసు అధికారుల, రాజకీయ నేతల పేర్లు కూడా ప్రాచుర్యంలోకి వస్తుండడం విశేషం. ప్రేమ పేరుతో ఓ యువతిని వంచించినట్లు లిక్కర్ డాన్ కుమారునిపై వచ్చిన ప్రధాన అభియోగం. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను శారీరకంగా వాడుకున్నాడని అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన బాధిత యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక తనను నమ్మంచి రూ. 90 లక్షల నగదును కూడా తీసుకున్నాడని, పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో ఆయా భారీ మొత్తాన్ని అప్పగించినట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో నిందితునికి రహస్య షెల్టర్ ఇచ్చినట్లు వరంగల్ జిల్లాకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కూడా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. నిందితుని తరపున వకాల్తా పుచ్చుకుని అతన్ని కాపాడేందుకు అధికార పార్టీకి చెందిన ఆయా నేత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అంతేకాదు కొందరు పోలీసు అధికారులకు కూడా లిక్కర్ డాన్ కుమారునితో సన్నిహిత సంబ:ధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ పరిణామాలపై వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తం వ్యవహారంపై కూపీ లాగేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను నియమించినట్లు తాజా వార్తల సారాంశం. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు లిక్కర్ డాన్ గా పేరుగాంచిన వ్యక్తిపైనా, అతని పుత్రరత్నంపైనా ఐపీసీ 417, 420, 376, 406, 506 సెక్షన్ల కింది కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు.