ఓ ఎస్ఐ తనపై తానే కేసు నమోదు చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భూవివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులతోపాటు ఫిర్యాదులో తన పేరు కూడా ఉండడంతో ఆయన ఈ కేసు నమోదు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెడితే…
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడ మల్కాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 43లో 12.00 ఎకరాల భూమికి సంబంధించి రెండు వర్గాలు వివాదానికి దిగాయి. ఆయా భూమి తమదంటే తమదని, భూములకు హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు.
అయితే ఈ అంశాన్ని అధికారులు తేల్చకపోవడంతో గుడమల్కాపురానికి చెందిన రమా ప్రభాకర్ కోదాడ కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఫిర్యాదులో పేర్కొన్నవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఆయా పరిణామాల్లో హుజూర్ నగర్ ఆర్డీవో వెంకటారెడ్డి, తహశీల్దార్ కృష్ణమోహన్, ఇతర రెవెన్యూ సిబ్బంది సహా మొత్తం 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఫిర్యాదులో పేర్కొన్న 17 మందిలో చింతలపాలెం ఎస్ఐ రంజిత్ రెడ్డి పేరు కూడా ఉండడంతో అనివార్యంగా ఆయన తనపై తానే కేసు నమోదు చేసుకోవలసి వచ్చింది.