సాక్షి దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళితోపాటు సీఈవో వినయ్ మహేశ్వరిలు సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టేసిందని ‘సాక్షి’ వెబ్ మీడియాలో ప్రచురించడంపై దాఖలైన పిటిషన్ కు సంబంధించి ‘సాక్షి’ ఎడిటర్, సీఈవోలు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
ఈ అంశంలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్ రావు గురువారం విచారణ చేపట్టారు. కౌంటర్ దాఖలుకు రెండు వారాల వ్యవధి కావాలని ప్రతివాదుల తరపు న్యాయవాది కోరగా, ఇందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఈనెల 13వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
గత ఆగస్టు 25వ తేదీన విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతుండగా, జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేశారని ‘సాక్షి’ వెబ్ మీడియాలో ప్రచురించినట్లు ఎంపీ రఘురామ కృష్ణరాజు తన పిటిషన్ లో ప్రస్తావించారు. ఈ అంశాన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఎడిర్ వర్ధెల్లి మురళి, సీఈవో వినయ్ మహేశ్వరిలు సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు.