అధికార పార్టీకి చెందిన ముగ్గురు నాయకులపై ఖమ్మం నగరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చేస్తున్న యుద్ధం, అందుకు సంబంధించిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీకి చెందిన ముగ్గురు నేతల నుంచి తనకు ప్రాణ హాని ఉన్నట్లు రియల్టర్ తుళ్లూరి శ్రీనివాస్ మీడియా సమావేశంలోనే ఆరోపించారు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నేతలు తనపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన వేడుకుంటున్నారు.
ఏళ్ల తరబడి సాగుతున్న భూవివాదాల అంశంలో రియల్టర్ శ్రీనివాస్ అధికార పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. తనపై సుపారీ హత్యకు కుట్ర పన్నినట్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతల పేర్లను ఉటంకిస్తూ శ్రీనివాస్ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మంచుకొండకు చెందిన పీఏసీఎస్ అధ్యక్షుడు మందడపు సుధాకర్, మందడపు మాధవరావు, యల్లంపల్లి హన్మంతరావుల మధ్య ఏళ్ల తరబడి వివాదాలున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే తుళ్లూరు శ్రీనివాస్ ను హత్య చేసేందుకు రామన్నపేట, దానవాయిగూడేలకు చెందిన కొందరితో కేసులో నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నారని, రూ. 30 వేలు నగదు, రెండు వేట కొడవళ్లు కూడా అందించారని పోలీసులు ప్రకటించారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మందడపు సుధాకర్ ను, మాధవరావును, హరీష్, వెంకన్నలను అదుపులోకి తీసుకున్నట్లు, వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.
అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించిన నిందితుల్లో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత కూడా ఒకరు ఉండడం గమనార్హం. మంచుకొండ పీఏసీఎస్ అధ్యక్షుడు, రైతుబంధు సమితి జిల్లా సభ్యునిగా మందడపు సుధాకర్ వ్యవహరిస్తున్నారు. మందడపు మాధవరావు, యల్లంపల్లి హన్మంతరావులు కూడా గులాబీ పార్టీ నేతలుగానే చెబుతున్నారు.
సుపారీ హత్యకు కుట్ర ఫిర్యాదు అంశంలో పోలీసుల దర్యాప్తులో తేలనున్న నిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఓ రియల్ వ్యాపారి అధికార పార్టీ నేతలతో తలపడుతున్న తీరు సహజంగానే చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత ఖిల్లాగా ప్రాచుర్యం గల ఖమ్మం జిల్లాలో, ముఖ్యంగా నగర కేంద్ర నియోజకవర్గంలో సుపారీ హత్యల ఆరోపణలకు సంబంధించిన ‘సంస్కృతి’పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫొటో: రియల్టర్ తుళ్లూరి శ్రీనివాస్