‘వందకు వంద శాతం గెలిపించాల్సిందే. ఒక్కటి ఓడినా పదవులు ఊడుతయ్. అడ్రస్ లేకుండా పోతరు. చివరికి ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోతరు.’ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం మంత్రులకు సున్నితంగా చేసిన హెచ్చరిక ఇది.
మున్సిపల్ ఎన్నికల నగరా మోగిన నేపథ్యంలో పార్టీ కేడర్ కు దిశా, నిర్దేశం చేసే ప్రక్రియలో భాగంగా నిర్వహించిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ చేసిన హెచ్చరికకు సంబంధించి ‘ఓడితే పదవులు ఊడుతాయ్’ అన్నదే అసలు సారాంశం. తాము నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో పార్టీ విజయం సాధిస్తున్నట్లు తేలిందని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిల మధ్య ఏర్పడిన వివాదానికి సంబంధించి కూడా కేసీఆర్ ఆరా తీసినట్లు వార్తల సారాంశం.
ఓకే.. కేసీఆర్ ఆదేశించారు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, సామాన్య కార్యకర్త అయినా, ఎవరైనా సరే పాటించాల్సిందే. పార్టీ అధినేత ఆజ్ఞను శిరసా వహించాల్సిందే. కానీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కు ఏమాత్రం జీర్ణం కాని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫలితాలను ఈ సందర్భంగా ఓసారి నెమరు వేసుకోక తప్పదు. అధికార పార్టీ అయినా సరే, తాము మాత్రమే నెగ్గాలని, మరొకరు గెలవకూడదనే లక్ష్యం కొందరు నేతల్లో ఉన్నపుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేందుకు ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ఫలితాలే అతి పెద్ద ఉదాహరణ. ప్రత్యేక తెలంగాణా సాధనలో భాగంగా ఆమరణ దీక్షకు దిగిన కేసీఆర్ ను 2009 డిసెంబర్ లో ఖమ్మం జిల్లా జైలుకు, ఆ తర్వాత ఆసుపత్రికి తరలించిన సందర్భంగా ఖమ్మంమెట్టు ప్రజలు ఆయనకు జేజేలు పలికిన దృశ్యాలను ఓసారి గుర్తుకు తెచ్చుకోండి.
అనంతర పరిణామాల్లో 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం స్థానంలో మాత్రమే టీఆర్ఎస్ విజయం సాధించడం గమనార్హం. కానీ అయిదేళ్ల కేసీఆర్ పరిపాలన అనంతరం, తుమ్మల నాగేశ్వర్రావు వంటి సీనియర్ టీడీపీ నేతను పార్టీలో చేర్చుకున్న పరిస్థితుల్లోనూ, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అధినేతకు ఏమాత్రం మింగుడు పడని ఫలితాలే రావడం విశేషం. తెలంగాణాలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించగా, ఖమ్మం జిల్లా ఫలితాలపై కేసీఆర్ ఏమాత్రం సంతృప్తి చెందని పరిస్థితి ఏర్పడింది. ఒక్కటంటే ఒకే ఒక్క స్థానంలో, ఉమ్మడి జిల్లా కేంద్రమైన ఖమ్మంలో మాత్రమే విజయంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అనంతర రాజకీయ పరిణామాల్లో పాలేరు, ఇల్లందు, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, పినపాక స్థానాల్లో గెల్చిన కాంగ్రెస్, టీడీపీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి జై కొట్టారనేది వేరే విషయం.
కానీ..గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ జీర్ణం కాని ఫలితాలు రావడానికి అసలు కారకులెవరు? వాస్తవానికి ఈ విషయంలో ఎన్నికల అనంతరం కేసీఆర్ కు గుట్టల కొద్దీ ఫిర్యాదులు కూడా వెళ్లాయి. తమ ఓటమికి సొంత పార్టీలోని ఫలానా వారే కారణమని పరాజిత సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు నివేదించి భోరున విలపించినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ‘ఓడితే పదవులు ఊడడం ఖాయం’ అంటూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ చేసిన సున్నిత హెచ్చరిక మరోసారి అప్పటి పరిణామాలపై చర్చకు ఆస్కారం కలిగిస్తోంది. అప్పటి చేదు ఫలితాల్లో కొన్ని ముఖ్య అంశాలనే ఈ సందర్భంగా మరోసారి పరిశీలిద్దాం.
రాజకీయంగా కాకలు తీరిన నేతగా ప్రాచుర్యం పొందిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమికి పాలేరులో దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఆయన ఓడితే తప్ప తమ ప్రాబల్యం పెరగదని భావించిన నేతలెవరు? ఆయన మళ్లీ గెలిస్తే తాము గెల్చినా ఉపయోగం లేదని ముందస్తు వ్యూహ రచన చేసిందెవరు? తుమ్మల ఓటమికి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ‘ఫండింగ్’ చేసినట్లు ప్రచారం జరిగిన కుబేరులెవరు? అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో జలగం వెంకట్రావు ఓటమికి పాటు పడిందెవరు? ఈసారి మళ్లీ గెలిస్తే కేసీఆర్ వద్ద ‘సామాజిక’ పరంగా వెంకట్రావు పట్టు సాధిస్తారని అంచనా వేసి, ఆయన ఓటమికి కృషి చేసిందెవరు? ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఇక్కడ కూడా ఎన్నికల ఖర్చు నిధులను సర్దుబాటు చేసిందెవరు? మధిర నియోజకవర్గంలో మల్లు భట్టి విక్రమార్కను ఓడించేందుకు కంకణం కట్టుకున్న తరహాలో, కాలిక రికాం లేకుండా తిరిగిన అప్పటి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుదలకు అంతర్గతంగా అడ్డు పడిందెవరు? ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి విజయానికి లోలోన పావులు కదిపిన అధికార పార్టీ నాయకుడెవరు? ఇద్దరి మధ్య గల పరస్పర సహకార స్నేహంలో అంతిమంగా పార్టీకి జరిగిన నష్టం ఏమిటి? ఇటువంటి అనేక ప్రశ్నలకు పార్టీ అధినేత కేసీఆర్ కు ఎప్పుడో సమాధానం కూడా లభించిందనే వాదనలు పార్టీ శ్రేణుల్లో ఉండనే ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ దక్కకుండా అడ్డుపడిన శక్తులేమిటి? నామా నాగేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చి మరీ గెలిపించుకోవడానికి దారి తీసిన పరిణామాలకు కారకులెవరు? ఈ తరహా ప్రశ్నలపైనా టీఆర్ఎస్ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే…కేసీఆర్ చేసిన తాజా హెచ్చరిక పార్టీ శ్రేణుల్లో విజయం కోసం పట్టుదలకే కాదు, సరికొత్త యోచనకు కూడా దారి తీసే అవకాశాలను తోసిపుచ్చలేని పరిస్థితి ఉందంటున్నారు. పార్టీ అభ్యర్థిని ఓడిస్తే ఫలానా నాయకుడి పదవి ఊడడం ఖాయమని సంకేతాలు సాక్షాత్కరిస్తున్నపుడు.. గెలిపించడం కన్నా, ఓడించడమే సులభమనే ఆలోచన కొందరిలో ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలానా నాయకుడి పదవి ఊడగొట్టడమే లక్ష్యంగా కొందరు పనిచేసే ప్రమాదకర పరిణామాలు సైతం ఏర్పడవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. ‘నేను మాత్రమే గెలవాలి..పార్టీలో ప్రత్యర్థి జాడ కూడా ఉండకూడదు. నా అధిపత్యం కొనసాగాలంటే ఫలానా చోట ఓడించడమే సులువు’ అనే లక్ష్యాన్నికొందరు నేతలు ఎంచుకునే అవకాశం లేకపోలేదన్నది పరిశీలకుల భావన. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తరహా ఫార్ములా అమలు చేసిన కొందరు అధికార పార్టీ నేతల చర్యలు, అనంతరం కేసీఆర్ కు వెళ్లిన ఫిర్యాదుల వెల్లువ సాక్షిగా… గెలిపించుటే కష్టం.. ఓడించుట… సొంత పార్టీలోనే ప్రత్యర్థుల పదవులు ఊడించుటే సులభం.