కోతి చేష్టలు అంటుంటాం కదా? ఇదిగో ఇటువంటి పనులనే కోతి చేష్టగా అభివర్ణిస్తుంటారు. మీరు చూస్తున్న ఈ ఫొటోకు సంబంధించిన విషయమే. వాస్తవానికి ఈ దృశ్యం హృదయవిదారకమే. రోడ్డు ప్రమాదానికి గురై, రక్తమోడుతున్న స్థితిలోనూ ఓ వానరం తన బిడ్డకు పాలిస్తున్న సీన్ కంట తడి పెట్టించే అంశమే. ఇటువంటి చిత్రాలు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ కలచి వేస్తాయి. గుండెలను పిండేస్తాయి. ఇందుకు కారకులైనవారిని బూతులు తిట్టాలనిపిస్తుంటుంది. కాకపోతే అది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే… ఎవరోగాని ఈ గుండెలు పిండే సీన్ కు సంబంధించిన ఫొటోకు ఓ చిన్నపాటి ‘కత’ను కూడా అల్లి సోషల్ మీడియాలో వదిలారు. తెలంగాణాలోని నర్సాపూర్ అడవుల్లో ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఆ వార్తా కథనాన్ని ఓసారి ఉన్నది ఉన్నట్టుగా దిగువన చదవండి.
కంటతడి పెట్టించిన కన్నతల్లి దృశ్యం
సంగా రెడ్డి జిల్లా నర్సాపూర్ to హైదరాబాద్ వెళ్లే హైవే పై గుమ్మడిదల గ్రామ శివారు నుండి అడవి ప్రాంతం కావడంతో అక్కడ జీవించే వన్యప్రాణులు ఆహారం కోసం అలమటిస్తున్న పరిస్థితి ఎదురైంది. దీంతో రోడ్డున పోయే వారు పడవేసే ఆహారం కోసం కోతి రోడ్డు దాటుతుండగా నర్సాపూర్ వైపు వెళుతున్న వాహనం ఢీకొట్టడంతో రక్తంతో తడిసి ముద్దయింది అదే సమయంలో తన బిడ్డ ఆకలితో ఉండటం చూసి ఆ రక్తపు మడుగులో తన తల్లి తన బిడ్డకు పాలిచ్చిన దృశ్యం అటు వైపు వెళ్లే వారిని కంటతడి పెట్టించింది దీంతో తల్లి మాతృత్వం పట్ల చూపించిన ప్రేమ అక్కడివారిని వారి మనసులను కదిలించే చేసింది ఈ దృశ్యం వాహనదారుల కెమెరాకు చిక్కింది…
వార్తను చదివారు కదా? ఇంతకీ అసలు విషయం ఏమిటో తెలుసా? ఇటువంటి ఘటనేదీ నర్సాపూర్-హైదరాబాద్ మార్గంలో జరగలేదు. ఎప్పడో 2018 నవంబర్ నెలలో కేరళ అడవుల్లో జరిగిన విషాద ఘటనకు సంబంధించిన ఫొటో ఇది. కావాలంటే ‘కేరళ కౌముది’ అనే మళయాల పత్రిక అప్పట్లో ప్రచురించిన వార్తా కథనపు క్లిప్ చూడండి. సోషల్ మీడియాలో వార్తకు రెండో వైపు వాస్తవమే కాదు…, ఇటువంటి ‘కోతి’ వార్తల ప్రచారం కూడా వ్యాప్తిలోకి వస్తుంటుంది. అదీ విషయం.