హుజూరాబాద్ ఉప ఎన్నికల అధికార పార్టీ రాజకీయాల్లో ఇప్పుడు కౌశిక్ రెడ్డి పేరు కూడా చేరింది. తాను బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. హుజూరాబాద్ నియోజవర్గ అభివృద్ధి కోసమే తాను అధికార పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణా భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో తాను గులాబీ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. ఈటెల రాజేందర్ తన స్వలబ్ధి కోసం రాజీనామా చేశారని విమర్శిస్తూ, కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని కౌశిక్ రెడ్డి కీర్తించారు.
కాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరవయ్యారనే ప్రచారం నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఆ పార్టీలో చేరుతుండడం గమనార్హం. ఇక్కడి నుంచి అధికార పార్టీ టికెట్ ను ఆశిస్తూ ఆ పార్టీలో చేరుతున్నారనే నాయకుల జాబితా చేంతాడులా పెరిగిపోతుండడం ఆసక్తికరం. మరికొందరు పార్టీలో చేరకుండానే టికెట్ ఆశావహుల జాబితాలో కనిపిస్తుండడం విశేషం. ఈటెల రాజేందర్ రాజీనామా అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థిగా వార్తల్లోకి వచ్చిన పలువురి జాబితాను ఓసారి పరిశీలిస్తే…
వకుళాభరణం కృష్ణమోహన్ రావు (బీసీ కమిషన్ మాజీ సభ్యుడు)
గెల్లు శ్రీనివాస యాదవ్ (టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు)
ముద్దసాని పురుషోత్తంరెడ్డి (రిటైర్డ్ కలెక్టర్)
ముద్దసాని కశ్యప్ రెడ్డి (దామోదర్ రెడ్డి కుమారుడు)
ముద్దసాని మాలతి ( దామోదర్ రెడ్డి భార్య)
పొనగంటి మల్లయ్య (జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్)
తుమ్మేటి సమ్మిరెడ్డి (జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్)
కడియం శ్రీహరి (మాజీ ఉప ముఖ్యమంత్రి)
పాడి కౌశిక్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత)
కోరెం సంజీవరెడ్డి (ట్రెస్మా నేత)
కనుమల్ల విజయ (కరీంనగర్ జెడ్పీ చైర్మెన్)
వి. సరోజన (ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు భార్య)
ఎ. ప్రవీణ్ రెడ్డి ( హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే)
వొడతెల ప్రణవ్ (వి. రాజేశ్వర్ రావు కుమారుడు)