కేసులు, అరెస్టులతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు. పెట్రోల్ , డీజిల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమ నిర్వహణకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, ధర్నా కార్యక్రమానికి తరలివస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసుల జీపుల్లో ఎక్కించుకువెళ్లి దాచి పెట్టారని ఆరోపించారు. ఈ రకమైన కిడ్నాపులతో, అరెస్టులతో, పోలీసులతో రాజ్యాన్ని, రాష్ట్రాన్ని నడపాలని కేసీఆర్ అనుకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. సంయమనం, సహనం నశించి తిరగబడే రోజువ స్తుందని, ఆ రోజు వచ్చిందని, కేసీఆర్ ప్రయివేట్ సైన్యం లాగా పోలీసులు వ్యవహరిస్తే చట్ట పరిధిలో చర్యలను ఎదుర్కోక తప్పదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, పదేళ్లపాటు అధికారంలో ఉంటుందని, ఇటువంటి అధికారులను వెతికి, వెతికి మరీ పట్టుకుంటామన్నారు.
ఇంటలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావుపైనా రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. నియమ, నిబంధనలను ఉల్లంఘించి అతన్ని ఈ పోస్టులో నియమించారని, నిజాం సర్కార్ లో హింసకు నాయకత్వం వహించిన ఖాసిం రిజ్విలాగా ప్రభాకర్ రావు తమ పార్టీ నాయకులపైనా, కార్యకర్తలపైనా దాడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభాకర్ రావు వ్యవహార శైలిపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకువెడతామని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రకాల విచారణలను ఆయన ఎదుర్కోవలసి వస్తుందన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియో లింక్ ద్వారా వీక్షించవచ్చు.