అంటే అన్నామంటారు గాని..తాము పనిచేసే వ్యవస్థలపై అక్కడి పెద్దలకు నమ్మకం ఉండాలి కదా? నమ్మకం లేని చర్యలకు దిగితే వాళ్ల పనితీరుపై వాళ్లకే నమ్మకం లేనట్లుగా మనం నమ్మక తప్పదు కదా? ఇది నమ్మకానికి సంబంధించిన విషయం. అందుకే నమ్మలేని నిజాన్ని బహిర్గతం చేయక తప్పడం లేదు. తమ పత్రికను ఎవరూ చదవడం లేదని ఓ పత్రిక ఎడిటర్ భావించారేమో… సిబ్బందికి ఓ వింత ఆదేశాన్ని జారీ చేయడమే అసలు విశేషం.
విషయాన్ని చేంతాడులా సాగదీయవచ్చుగాని…క్లుప్తంగానే చెప్పుకుందాం. సహజంగా ఎడిటర్ అంటే ఎవరు? ఫిల్మ్ ఎడిటర్, వీడియో ఎడిటర్ వంటి హోదాలు కావు లెండి. జర్నలిస్టిక్ పరిభాషలో ఎడిటర్ అంటే ఎవరు? పత్రికకు కుటుంబ యజమాని లాంటివాడు. సరే ప్రస్తుత జర్నలిజపు పోకడల్లో కొన్ని యాజమాన్యాలే పత్రికల ఎడిటర్లుగా ఉన్నాయనుకోండి. అది వేరే విషయం. కానీ ఎడిటర్ అంటే తెలుగులో సంపాదకుడన్న మాట. ‘సంపాదకుడు’ అనే పదంలో మరో అర్థం కూడా ఏమీ లేదు. ఇంగ్లీష్ లో కాసేపు ఎడిటరే అనుకుందాం. సాధారణంగా ఎడిటర్లు ఏం చేస్తారు? వెనకటి రోజుల ఎడిటర్లు కాదనుకోండి. ప్రస్తుతం అనేక మంది ఎడిటర్లలో కొందరు తమ నిర్దేశపు విధులే కాకుండా, యాజమాన్య ప్రయోజనాలు కూడా నెరవేరుస్తున్నారు. ఇది కూడా వేరే విషయమే. మళ్లీ కథనం దారి తప్పుతున్నట్లు అనిపిస్తోందా?
సరే.. అసలు విషయంలోకే వద్దాం. ఈ మధ్య ఓ పత్రిక ఎడిటర్ తన కలాన్ని విదిలిస్తూ ఓ కళాఖండాన్ని రాశారు. సదరు ‘కళాఖండం’ భజన కీర్తనా? భుజ కీర్తనా? అనే సందేహాలు వద్దు. ఏదో ఒక కీర్తనలో సంకీర్తనగా భావించి ఆయన అక్షర రాగం తీశారు. ఆ కళాఖండాన్ని తాను పనిచేస్తున్న పత్రికలో ప్రముఖంగానే ప్రచురించారు. తాను పని చేస్తున్న పత్రిక కూడా మరీ చిన్నా, చితకా, అనామక సంస్థేమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఓ స్థాయి ఉన్న పత్రికగానే పేరుంది. తన కళాఖండపు వ్యాసాన్ని పత్రికలో ప్రచురించుకున్నప్పటికీ, సదరు సంపాదకులవారికి సరైన తృప్తి కలిగినట్లు లేదు.
ఇంకేం ఆయా వ్యాసాన్ని పత్రిక ఈ-పేపర్ నుంచి ‘క్లిప్’ ఇమేజ్ రూపంలో డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాల్సిందిగా పత్రిక సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎడిటర్ లాంటి పెద్ద మనిషి నుంచి ఆదేశాలు జారీ అయ్యాక, సదరు క్లిప్ ను వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్కుల్లో, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లోకి ఫార్వార్డ్ చేయకపోతే బాగుండదు కదా? మరోవైపు సదరు సంస్థలో పనిచేసే హెచ్ వో డీలు కూడా ఎడిటర్ గారి ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలని తమ విభాగాల సిబ్బందిని పురమాయించారాయె. ఇంకేముంది సిబ్బంది రెచ్చిపోయి ఎడిటర్ గారి కళాఖండపు వ్యాసాన్ని సోషల్ మీడియాలో పోటీలు పడి మరీ అప్ లోడ్ చేశారు. మొత్తంగా ఈ చర్య ద్వారా సదరు ఎడిటర్ గారు తన కళాఖండపు వ్యాసం సోషల్ మీడియా ద్వారా ఖండాంతరాలకు వ్యాపించినట్లు ఫీలయ్యారట. సరే ఆయన ‘తుత్తి‘ ఆయనది.
కాకపోతే అసలు విషయమేమిటంటే సదరు పత్రికా సిబ్బంది తమ సంస్థకు చెందిన గ్రూపుల్లో మాత్రమే పోటీలు పడీ మరీ ఎడిటర్ గారి కళాఖండాన్ని ఫార్వార్డ్ చేశారట. ఎందుకంటే తాము ఫార్వార్డ్ చేసిన విషయం ఎడిటర్ గారికి తెలియాలి కదా మరి? తమ సంస్థ గ్రూపుల్లోనే వరుసగా వచ్చి చేరుతున్న ఎడిటర్ గారి కళాఖండపు వ్యాసాన్ని చూసి మురిసిపోవాలో.. మూర్ఛపోవాలో తెలియని అయోమయ స్థితిని హెచ్ వోడీలు ఎదుర్కున్నారట. అదీ సంగతి.