‘పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టిచ్చుడు…’ అనేది తెలంగాణా నానుడి. ఓ వ్యక్తి ఆత్రుతకు సంకేతంగా ఆయా సామెతను తెలంగాణా పల్లెల్లో ఎక్కువగా వాడుతుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనే గల ఓ గ్రామ పంచాయతీ నిర్వాకం గురించి తెలిసిన వారు ఆయా సామెతను అన్వయించుకుంటూ జోకులు పేలుస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే ఓ బాలుడు ఈనెల 23వ తేదీన జన్మించినట్లు పంచాయతీ అధికారులు బర్త్ సర్టిఫికెట్ జారీ చేశారు. అర్థం కాలేదా…? మళ్లీ ఓసారి తేదీని పరిశీలించండి. మరో 13 రోజులకు రానున్న 23వ తేదీన బాలుడు జన్మించినట్లు జనన ధృవీకరణ పత్రం జారీ చేశారన్న మాట. అదేమిటీ… అని ఆశ్యర్యపోకండి. విషయంలోకి వెడితే…
లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ పంచాయతీ పరిధిలోని బంగారు చెలకకు చెందిన పారిపర్తి నాగరాజు, మౌనిక దంపతులకు శ్రీమాన్ చె గువేరా అనే బాలుడు జన్మించాడు. భవిష్యత్ అవసరాల కోసం తమ కుమారుడికి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ప్రశాంతినగర్ పంచాయతీ అధికారులకు ఈ దంపతులు దరఖాస్తు చేసుకున్నారు. ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో తమ కుమారుడు జన్మించినట్లు నివేదించారు. నిరుడు జూలై 29వ తేదీన ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈమేరకు ఈనెల 18వ తేదీన ప్రశాంతి నగర్ పంచాయతీ అధికారులు శ్రీమాన్ చె గువేరా పేరున బర్త్ సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే ఈనెల 23వ తేదీన ఆయా బాలుడు జన్మించినట్లు పంచాయతీ అధికారులు సర్టిఫికెట్ జారీ చేయడమే అసలు విశేషం. అదీ అసలు విషయ. ఆయా సర్టిఫికెట్ ప్రతిని దిగువన మీరూ చూసేయండి మరి.
ఫొటో: ప్రతీకాత్మక చిత్రం