పోసాని కృష్ణమురళి తీసిన ‘రాజావారి చేపల చెరువు’ సినిమా గుర్తుంది కదా? ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన అవినీతిపై, రెడ్ టేపిజంపై విసిరిన వ్యంగ్యాస్త్రపు చిత్రం అది. అచ్చంగా పోసాని తీసిన రాజావారి చేపల చెరువు సినిమాను తలపించే ఘటన ఇది. కాకపోతే ఇది కల్పిత కథ కాదు. వాస్తవిక ఉదంతం. విషయమేమిటంటే…?
తన వ్యవసాయ పొలంలోని బావి కనిపించడం లేదని మల్లప్ప అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోయిన తన బావిని వెతికి పెట్టాలని పోలీసులను అభ్యర్థించారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు నివ్వెరపోయారు. కర్నాటకలోని బెళగాని జిల్లా మావిన హొండ గ్రామానికి చెందిన మల్లప్ప అనే రైతు చేసిన ఈ ఫిర్యాదు వెనుక గల అసలు కారణాన్ని పోలీసులు తమ విచారణలో తేల్చారు.
వాస్తవానికి మల్లప్ప వ్యవసాయ పొలంలో ఎటువంటి బావి లేదుట. కానీ మల్లప్ప పొలంలో బావి తవ్వినట్లు రికార్డులు క్రియేట్ చేసి పంచాయతీ అధికారులు ప్రభుత్వ నిధులు మింగేశారట. అయితే బావి తవ్వించుకున్నందుకుగాను తీసుకున్న అప్పు చెల్లించాలని రైతు మల్లప్పకు నోటీసులు అందాయి. దీంతో అవాక్కయిన మల్లప్ప ఆందోళన చెందకుండా… తన బావి కనిపించడం లేదని, కాస్త వెతికి పెట్టాలని పోలీసులను ఆశ్రయించారు. అదీ అసలు సంగతి. మల్లప్ప బావి ‘కత’ చదివాక పోసాని తీసిన రాజావారి చేపల చెరువు సినిమా గుర్తుకొస్తోంది కదూ…!
ఫొటో: ప్రతీకాత్మక చిత్రం