పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కొందరు మెత్తబడినట్లే కనిపిస్తోంది. రేవంత్ ను కలవడానికే ఇష్టపడని అసంతృప్త నాయకులు పలువురు మంగళవారం ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం, పీసీసీ అధ్యక్షునిగా విజయవంతం కావాలని కాంక్షించడం విశేషం. ముఖ్యంగా సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డిని కలవడానికి నిరాకరించారు. మాజీ ఎంపీ, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షునిగా నియమితుడైన మల్లు రవి చర్చల అనంతరం భట్టి మెత్తబడినట్లు కనిపించింది.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నాటి పదవీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావలసిందిగా కోరారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. సమష్టి నిర్ణయాలతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మల్లు అనంత రాములు కుటుంబం కాంగ్రెస్ అనే పదానికి పర్యాయమని నిర్వచించారు. సీఎల్పీ, పీసీసీ పార్టీకి రెండు కళ్లలాంటివని అభివర్ణించారు. జోడెద్దుల్లాగా దూసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామన్నారు.
అదేవిధంగా మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబును కూడా రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ కు శాలువా కప్పి శ్రీధర్ బాబు సత్కరించి, శుభాకాంక్షలు చెప్పారు. మర్రి శశిధర్ రెడ్డిని కూడా రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో అపార అనుభవం గల మర్రి శశిధర్ రెడ్డి సలహాలు, సూచనలతో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. దివంగత మర్రి చెన్నారెడ్డి దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, తెలంగాణా ఆకాంక్షను తొలిసారిగా చాటి చెప్పిన కుటుంబంగా కొనియాడారు. రేవంత్ రెడ్డి నియామకంపై బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మర్రి శశిధర్ రెడ్డి పార్టీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయా పరిణామాల నేపథ్యంలో రేవంత్ మంగళవారం అటు భట్టి విక్రమార్కను, ఇటు శశిధర్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి నాయకులను కలిసి ఆహ్వానించడం విశేషం.