టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వర్ రావు సోదరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి తమకు రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తూ ఎంపీ నామ నాగేశ్వర్ రావు సోదరులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. నామ నాగేశ్వర్ రావు సోదరులు దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ రొహిన్టన్ ఫాలీ నారిమన్, జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ బిఆర్ గవాయ్ లతో కూడి త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
నామ నాగేశ్వర్ రావు, ఆయన సోదరుడు నామ సీతయ్యలపై ఎటువంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాలను దారి మళ్లించారనే అభియోగాలపై నామ నాగేశ్వర్ రావు, సీతయ్యలకు చెందిన నివాసాలపై, మధుకాన్ సంస్థల ఆఫీసులపై ఈడీ అధికారులు ఇటీవల దాడులు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 25న తమ ముందు విచారణకు హాజరు కావాలని కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నామ నాగేశ్వర్ రావు సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.