తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు, కార్యకర్తలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు. రెండేళ్లపాటు కుటుంబ సభ్యుల నుంచి సెలవు తీసుకోవలసిందిగా కోరారు. ఓ బ్రహ్మ రాక్షసునిపై పోరాటం చేసేందుకు వెడుతున్నట్లు కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ శ్రేణులు స్పష్టం చేయాలన్నారు. రెండేళ్లపాటు తాము తిన్నామా? లేదా? అనే విషయాలను కూడా పట్టించుకోవద్దని, తమపై పెద్ద బాధ్యత ఉన్నట్లు, తెలంగాణా సమాాజం కోసం కొట్లాడుతున్నట్లు కుటుంబ సభ్యులకు వివరించి సెలవు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రావణాసురున్ని ఎదుర్కోవడం రాముడి ఒక్కడివల్ల కాలేదని, వానర సైన్యం పూనుకున్న తర్వాతే రావణుని పతనం ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇదే తరహాలో పోరాటం చేయాలన్నారు. వానర సైన్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంటికొకరు చొప్పున కదలాలని, తెలంగాణా ఇచ్చిన సోనియాగాంధీ ఆకాంక్షను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులతో హైదరాబాద్ లో సమావేశం నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తెలంగాణా తల్లి ఎలా ఉంటుంతో మనకు తెలియదని, ఎన్నడూ చూడలేదని, ఎవరికి తోచిన విధంగా వారు బొమ్మలు గీసుకుని తెలంగాణా తల్లిగా భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణా తల్లి సోనియాగాంధీ లాగే ఉంటారని, తెలంగాణాను ఇచ్చిన సోనియాగాంధీయే తెలంగాణా తల్లిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు.
ట్యాంకు బండ్ వద్ద నిర్మిస్తున్న అమర వీరుల స్తూపంలోనూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రూ. 63 కోట్లకు టెండర్ పిలిచి, ఇప్పటికే రూ. 80 కోట్లు ఖర్చు చేశారని, మరో రూ. 100 కోట్లు అదనంగా కావాలంటున్నారని చెప్పారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల్లోనేగాక, శాండు, ల్యాండు, వైన్, మైన్, కాంట్రాక్టుల్లోనూ దోచుకోవడం పూర్తయిందని, చివరికి అమరవీరుల స్థూపం నిర్మాణాన్ని కూడా తమ అవినీతి కార్యకలాపాలకు వదల్లేదని ధ్వజమెత్తారు. అమరవీరుల స్థూపం కూడా అవినీతికి బలి కావడం దుర్మార్గమన్నారు. మీడియా మిత్రులు ముందే విజువల్స్ తీసుకోవాలని, ఆ తర్వాత తాను అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. తెలంగాణాలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కరోనా వల్ల పేదల బతుకులు దుర్బరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.