దళిత మహిళ మరియమ్మ మృతి తరహా ఘటనలను ఉపేక్షించేది లేదని తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో కస్టోడియల్ డెత్ ఘటనలో బాధిత మరియమ్మ కుటుంబాన్ని పరామర్శిచేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ ను డీజీపీ స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. పోలీసు శాఖలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని డీజీపీ నిర్దేశించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఇటువంటి ఘటన జరగడం బాధాకరమని డీజీపీ అన్నారు. ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినకుండా పోలీసు అధికారులు వ్యవహరించాలన్నారు. నేరస్థుల విచారణ సందర్భంలో జరిగిన ఈ ఘటన బాధ కలిగించిందని మహేందర్ రెడ్డి అన్నారు. ఈ తరహా సంఘటనలను పునరావృతం కాకుండా చూస్తామన్నారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులోనూ సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం ఘటనపై విచారణ చేస్తున్నామని, ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. దోషులుగా తేలినవారిపై చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటామన్నారు. అడ్డగూడూరు తరహా చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.