మావోయిస్టు పార్టీలో కరోనా వ్యాప్తికి భయపడి ఇద్దరు నక్సలైట్లు తమ ఎదుట లొంగిపోయినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ శనివారం ప్రకటించారు. వీరిలో మణుగూరు ఏరియా ఎల్వోఎస్ ఏరియా కమిటీ సభ్యుడు మడివి ఇడుమ అలియాస్ సురేందర్ (23), దళ సభ్యురాలు మడకం బుద్రి అలియాస్ సోని (23) ఉన్నట్లు చెప్పారు. ఇడుమ మావోయిస్టు పార్టీలో ముఖ్యపాత్ర పోషించాడని, ప్రస్తుతం ఇతను ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా మడక బుద్రి అనే దళ సభ్యురాలు మావోయిస్టు నేత ఆజాద్ కు గార్డుగా పనిచేసిందని, ఇడుమను బుద్రి వివాహం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు.
ఈ ఇద్దరు మావోయిస్టులు ఆ పార్టీలోని అగ్ర నాయకత్వం వేధింపులకు, పార్టీలోని నేతలకు, సభ్యులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో భయపడినట్లు తెలిపారు. హరిభూషణ్, సోబ్రాయ్, గంగు, ప్రకాష్ భారతక్కలు కరోనా వైరస్ సోకి మరణించడంతో మావోయిస్టు పార్టీలోని నాయకుల్లోనేగాక సభ్యుల్లో భయం ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా మావోయిస్టు పార్టీ నాయకులు, సభ్యులు లొంగిపోవాలని కోరారు. లొంగిపోయిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని, పునరావాసం కల్పించి వారికి అందాల్సిన ప్రతిఫలాలను అందేలా చూస్తామని ఎస్పీ సునీల్ దత్ హామీ ఇచ్చారు.