దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేంటని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. కృష్ణా నది నీళ్ల తరలింపునకు సంబంధించి వైెస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణా పాలిట దొంగ అయితే, ఇవ్వాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణాకు మరింత అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గజదొంగగా పువ్వాడ సైతం వ్యాఖ్యానిస్తూ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం కరెక్ట్ అని చెబుతూ, ఈ అంశంలో జగన్ తండ్రిని మించిన తనయుడని కూడా అజయ్ అభివర్ణించారు.
తెలంగాణా ప్రజల ప్రయోజనాలు కాపాడడంలో తెలంగాణా మంత్రులు పోరాడుతారని, ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్లడానికి తాము సిద్ధమన్నారు. భూమ్యాకాశాలను ఏకం చేసి పోరాడుతామని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద మాట పడనివ్వబోమని చెబుతున్నవారు ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. కృష్ణా నది నీటి వాటాలపై హక్కును వదులుకునే ప్రసక్తే లేదన్నారు. రాయలసీమకు నీళ్లిస్తామని కేసీఆర్ చేసిన ప్రకటనకు వక్రభాష్యం పలుకుతున్నారని, కృష్ణా నది నుంచి నీళ్లిస్తామని కేసీఆర్ చెప్పారా? అని ప్రశ్నించారు. తాము చెవిలో పూలు పెట్టుకున్న అశక్తులం కాదన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల వల్ల చుక్క నీరు రాలేదని, రూ. 2,600 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. తెలంగాణాకు చెందిన ఏడు మండలాలను అక్రమంగా గుంజుకుని పోలవరం ప్రాజెక్టు కట్టారన్నారు. భట్టి విక్రమార్క ఆరోజున ఏం చేశారని ప్రశ్నించారు. కలిసి కొట్లాడుతామని, నీటి చౌర్యాన్ని అడ్డుకుంటామని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. తమ హీరోయిజనం చూపించడానికి మాట్లాడడం లేదని, తెలంగాణా ప్రజల హక్కుల కోసం మాట్లాడుతున్నట్లు చెప్పారు. ప్రజలు తమకు ఇచ్చిన ప్రాథమిక బాధ్యతను నెరవేరుస్తున్నామని మంత్రి అజయ్ అన్నారు.