తెలంగాణా సీఎం కేసీఆర్ తో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం ప్రగతి భవన్ లో భేటీ కావడంపై బీజేపీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి కాంగ్రెస్ బీ-టీంగా పనిచేయబోతున్నదని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఓట్ల బదలాయింపు కోసమే కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని తాను అనడం లేదని, ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత వి. హనుమంతరావు గతంలో ఆవేదన చెందారని, ఆయన మాటలు నిజమయ్యాయని రఘునందర్ రావు అన్నారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో న్యాయం చేయాలని భట్టి విక్రమార్క సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసిన సమయంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా లంకలో పుట్టినోళ్లందరూ రాక్షసులేనని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారని, ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలు లేవు కాబట్టి ఆంధ్రోళ్ల ఓట్లు టీఆర్ఎస్ కు అవసరం లేదన్నారు. అందువల్ల మరోసారి సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంట్లో భోజనం చేసినప్పుడు రాక్షసులని సీఎం కేసీఆర్ కు తెలియదా? ప్రగతి భవన్లో అలయ్… బలయ్ ఇచ్చినప్పుడు రాక్షసులని మంత్రి ప్రశాంత్ రెడ్డికి, శ్రీనివాస్ గౌడ్ కు తెలియదా? అని ప్రశ్నించారు. ఎన్నికను బట్టి సీమాంధ్రులపై టీఆర్ఎస్ నాయకుల విమర్శలు మారుతుంటాయన్నారు. రాక్షసులకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశర్వం పనుల కాంట్రాక్టులు ఎందుకిచ్చారని అన్నారు. యువరాజు కేటీఆర్ తన చుట్టూ రాక్షసులను ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని రఘునందన్ రావు నిలదీశారు.