హుజూరాబాద్ ఉప ఎన్నికలకు అధికార పార్టీ భారీ స్కెచ్ వేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ఓటమే లక్ష్యంగా టీఆర్ఎస్ నాయకులు, కేడర్ ఇప్పటికే రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. సర్వశక్తులను ఒడ్డడం ద్వారా ఈటెలను ఓడించి 2023 ఎన్నికలపై బీజేపీ ఆశలపై నీళ్లు కుమ్మరించాలనే ధ్యేయంతో అధికార పార్టీ పావులు కదుపుతోంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలను అధికార పార్టీ అత్యంత సున్నిత అంశంగా భావిస్తున్నదట. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, ఇల్లంతకుంట మండలాల్లోని చాలా ఏరియాలను సమస్యాత్మకంగా పరిగణిస్తున్నదట.
దీంతో ఉప ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే పోలీసు యంత్రాంగాన్ని భారీ ఎత్తున మోహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మండలానికో ఏసీపీ చొప్పున సబ్ డివిజనల్ స్థాయి పోలీసు అధికారిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించినట్లు వార్తలు వచ్చాయి. అంతేగాక ప్రతి మండలానికి ఐదుగురు సీఐల చొప్పున నియమించినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రతి మండలానికి పది మంది ఎస్ఐలతో కూడిన ప్రత్యేక టీంలను కూడా మోహరింపజేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ఓ ఎస్ఐ, అతనికి తోడుగా పది మంది మెరికల్లాంటి కానిస్టేబుళ్లను ఎంపిక చేసి హుజూరాబాద్ నియోజకవర్గానికి పంపిస్తున్నట్లు తెలిసింది.
అయితే ఆయా పోలీసు అధికారులు, సిబ్బంది ఏం చేయనున్నారనే ప్రశ్నపై అధికార పార్టీ వర్గాలు క్లారిటీ ఇస్తుండడం విశేషం. మాజీ మంత్రి ఈటెల వర్గీయులు చాలా ప్రాంతాల్లో టీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొడుతున్నాయని, ఏదేని ఘర్షణ జరిగితే అడ్వాంటేజీగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితులను, పరిణామాలను చక్కదిద్దేందుకు, శాంతిభద్రతలను కట్టుదిట్టంగా పరిరక్షించేందుకు పోలీసు బలగాలను ముందస్తుగానే మోహరిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా నోటిఫికేషన్ కు ముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ అమలు చేస్తున్నట్లు పేర్కొంటున్న ‘పోలీస్’ స్కెచ్ సర్వత్రా చర్చకు దారి తీస్తోంది.