ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు వారం, పది రోజులుగా ఆయన బాహ్య ప్రపంచంలో కనిపించడం లేదు. పోలీసులు ఆయన అరెస్టుకు ప్రయత్నిస్తుండడమే ఇందుకు కారణంగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నాయకుడు, 57వ డివిజన్ కార్పొరేటర్ రబీదా బేగం భర్త మహ్మద్ ముస్తఫాపై పోలీసులు పీడీ యాక్టు అమలు ద్వారా నిర్బంధించి చంచల్ గూడ జైలుకు తరలించిన నేపథ్యంలో, తాజాగా మరో కార్పొరేటర్ భర్త, కాంగ్రెస్ నాయకుడు అజ్ఞాతంలోకి వెళ్లడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర కలవరాన్ని కలిగిస్తోంది.
మిక్కిలినేని నరేంద్ర అనే ఖమ్మం నగర కాంగ్రెస్ నాయకుడు గడచిన వారం, పదిరోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. తాను వినియోగిస్తున్న ఫోన్ నెంబర్లు కూడా పని చేయకపోవడం గమనార్హం. అయితే కాంగ్రెస్ ముఖ్యులు కొందరితో మాత్రం ఆయన వాట్సప్ కాల్ ద్వారా టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మిక్కిలినేని నరేంద్ర గత మున్సిపల్ ఎన్నికల్లో తన భార్య మంజులను 54వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలిపించుకున్నారు. అధికార పార్టీతో హోరాహోరీగా తలపడి గెల్చిన పది మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లలో నరేంద్ర భార్య మంజుల కూడా ఒకరు.
అయితే ఎన్నికల సందర్భంగా నరేంద్ర ఇంటి వద్ద జరిగినట్లు పేర్కొంటున్న ఓ ఘర్షణ ఘటనలో పోలీసులు అతనిపై ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయగా, ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా నరేంద్ర యాంటిసిపెటరీ బెయిల్ తెచ్చుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న మరో ఘటనలో పోలీసులు నరేంద్రపై ఐపీసీ 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఓ పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై నమోదైన కేసులో నరేంద్రను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అటు ముస్తఫా, ఇటు మిక్కిలినేని నరేంద్ర ఉదంతాలు ఖమ్మం నగర కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైనట్లు సమాచారం. అయితే ఈ రెండు ఉదంతాల్లోనూ తాము పోలీసు ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని, పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ చెబుతున్నారు. ఇటీవలే పోలీస్ కమిషనర్ ను కలిసి ఓ వినతి పత్రాన్ని కూడా సమర్పించినట్లు ఆయన చెప్పారు. మిక్కిలినేని నరేంద్ర అజ్ఞాతంలోకి వెళ్లిన అంశాన్ని దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు.
ఫొటో: మిక్కలినేని నరేంద్ర (ఫైల్)