తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన నియామకం ఇక లాంఛనమేనని విశ్వసనీయంగా తెలిసింది. ఈమేరకు సోమవారం రాత్రే సీఎం కేసీఆర్ సోమేష్ కుమార్ నియామకానికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ ఎస్కే జోషి మరో రెండు గంటల్లో…అంటే సాయంత్రం 4 గంటలకు పదవీ విరమణ చేయనున్నారు. ఈలోగా మధ్యాహ్నం మూడు గంటలకు కొత్త చీఫ్ సెక్రటరీగా సోమేష్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ నియామకంపై కాస్త సందిగ్ధత ఏర్పడిందనే వాదన కూడా మరో వైపు వినిపిస్తోంది. అజయ్ మిశ్రా నియామకం కోసం ఓ వర్గం సీఎం కేసీఆర్ పై వత్తిడి చేస్తున్నట్లు, లాబీయింగ్ జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లాబీయింగ్ ప్రభావం లేకపోతే సోమేష్ కుమార్ చీఫ్ సెక్రెటరీగా పదవీ బాధ్యతలు స్వీకరించడం ఖాయమనేది ప్రచారపు సారాంశం.