తెలంగాణా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో శనివారం సమావేశమైన కేబినెట్ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేత, వచ్చే నెల 1వ తేదీ నుంచి విద్యా సంస్థల పునఃప్రారంభం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని ముఖ్య నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయా నిర్ణయాల వివరాలు ఇవీ:
- కొత్తపేటలో ప్రస్థుత కూరగాయల మార్కెట్ ను పూర్తిగా ఆధునికీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తూ దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అధునికీకరించాలని, దానికి తోడుగా మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయిస్తూ, మొత్తం నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కేబినెట్ మంజూరు చేసింది.
- వీటిని చెస్ట్ హాస్పటల్ ప్రాంగణంలో, ఈ మధ్యనే గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్లను టిమ్స్ సహా కలిపి నాలుగు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది.
- రాష్ట్రంలో గత సంవత్సరం వరిధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నుల పైచిలుకుగా ఉందని, వ్యవసాయ శాఖ కేబినెట్ కు తెలిపింది. ఈసారి ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే 60 శాతం ఎక్కువ వానలు పడ్డాయని, గత సంవత్సరం కంటే 5 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని వ్యవసాయ శాఖ కేబినెట్ కు వివరించింది.
- ముగిసిన సీజన్ లో పండిన 1.4 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని, మరో 1.6 కోట్ల టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొన్నారని మార్కెటింగ్ శాఖ వివరించింది.
- రూ. 5,145 కోట్ల మెత్తాన్ని రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని వ్యవసాయ శాఖ తెలిపింది.
- ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా కష్టకాలంలో కూడ ధాన్యం సేకరణను రికార్డు స్థాయిలో జరిపిన పౌర సరఫరా, గ్రామీణాభివృద్ధి సంబంధిత శాఖల అధికారులను, సిబ్బందిని కేబినెట్ అభినందించింది.
- వృత్తిలో గల యాదవులకు గొర్ల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.
- క్షవర వృత్తిలో వున్న నాయీ బ్రాహ్మణులకోసం గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
- చేనేత, గీత కార్మికులకు త్వరితగతిన బీమా అందించడానికి చర్యలు తీసుకోవాలని, మత్స్య కార్మికులకు, గీత కార్మికులకు అందించాల్సిన ఎక్స్ గ్రేషియా ను, వివిధ వృత్తి కులాలకు ఎంబీసీ కర్పోరేషన్ కు నిధులు విడుదల చేయాలని కేబినెట్ ఆదేశించింది.
- రైతుల తరహాలోనే వృత్తి కులాలకు కూడా సత్వరమే బీమా చెల్లింపులు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.