ప్రస్తుతం గల జిల్లాల్లోనే ఓ కేంద్రానికి భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును ప్రభుత్వం పెట్టబోతున్నదా? హన్మకొండకు ‘పీవీఎన్ఆర్’ జిల్లాగా నామకరణం చేయనున్నారా? అనే ప్రశ్నలకు ఔననే ప్రచారపు సారాంశంతో చర్చ జరుగుతున్నది. ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రాన్ని పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తున్నప్పటికీ, దీనిపై అధికార పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లాను ‘పీవీఎన్ఆర్ హన్మకొండ జిల్లాగా మార్చే అవకాశం ఉందంటున్నారు. దీని పరిధిలోకి పీవీ జన్మించిన నర్సంపేట సమీపంలోని ఆయన అమ్మమ్మగారి ఊరు లక్నేపల్లి (ఇపుడు వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్నది), పీవీ తండ్రి, తాతల ఇల్లు భీమదేవరపల్లి మండలం వంగర (ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్నది) గ్రామాలను ఇందులోకి తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా పేరు మార్పుపై తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరంగల్లో సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి ఈనెల 21న సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారని చెప్పారు. సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భూమిపూజ అనంతరం కేసీఆర్ కాళోజీ హెల్త్ వర్సిటీ, కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లా పేరును హన్మకొండగా మార్చే అవకాశం ఉందని ఎర్రబెల్లి ప్రకటించారు. అయితే కేవలం హన్మకొండ జిల్లాగా మత్రమే కాదని, పీవీఎన్ఆర్ హన్మకొండగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.