తర్కం లేని అంశం గురించి తర్కించక తప్పదు. అర్థం, పర్థం లేని ప్రచారాలపై అభిప్రాయాన్ని వ్యక్తీకరించక తప్పదు. ఇదిగో ఈ సోషల్ మీడియా పోస్టింగ్ చూడండి. ‘హైందవ శక్తి’ పేరుతో చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. ‘జనవరి 1 వద్దు-మన ఉగాది ముద్దు’ పేరుతో తిరుగుతున్న ఈ పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ జనవరి 1 వేడుకలు…, ఆంగ్ల సంవత్సర స్వాగత సంబరాలు జరపాలా? వద్దా? ఉగాది కోసం వేచి చూడాల్సిందేనా? ఇదేగా సందేహం. అందుకే ‘న్యూ ఇయర్’ గురించి కాసేపు మాట్లాడుకుందాం.
జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర ప్రారంభ దినంగా జరుపుకోకూడదని, ఉగాదిని మాత్రమే అలా జరుపుకోవాలనడంలో హేతువు లేదు. రెండూ ఒకటే కాదు కాబట్టి హేతువు లేదు. వాస్తవమే.. రెండూ ఒకటి కాదు. ఉగాది తెలుగు సంవత్సరాది. జనవరి ఒకటి ఆంగ్ల సంవత్సర ప్రారంభ దినం. అంతే.
ఉగాది పండుగను మనందరం ప్రతీ సంవత్సరం చాలా బాగా జరుపుకుంటున్నాం కదా! జనవరి ఒకటవ తేదీ సంబరాలను మనలో ఎవరూ ఉగాదిలా చేసుకోవడలేదు కదా! రెండూ వేర్వేరే కదా! జనవరి ఒకటిన కేవలం మనం ఏ కేలండరును ఫాలో అవుతున్నామో, ఆ కేలండరు ప్రకారం సంవత్సరం మారుతోందనే భావనతో మాత్రమే గ్రీటింగ్ డే చేసుకుంటున్నాం. అంతే… నూతన సంవత్సరానికీ ఉగాదికి ‘సహస్రం’ తేడా ఉంది. అసలు రెండింటికీ పోలికే లేదు. కవిసమ్మేళనాలతో, పంచాంగ శ్రవణాలతో మనం మన ఉగాదిని ఎంతో బాగా జరుపుకుంటాం! ఉగాది పండుగ, జనవరి ఒకటి రెండూ ఆనందించదగ్గ రోజులే. ఆ మాటకొస్తే సంవత్సరంలో అన్ని రోజులు ఆనందించదగ్గవే. మనకి మనమే గందర గోళం సృష్టించుకోవడం అనవసరం.
జనవరి ఒకటి సందర్భంలో గాని, అనేక తెలుగు పండుగల సందర్భంలో గాని మందు.. విందు పార్టీల విషయంలో ఫ్రభుత్వం కట్టడి చేయలేక పోవడానికి కారణం ప్రజల మనస్తత్వమే తప్ప.. మరేమి కాదన్నది పలువురి అభిప్రాయం.
ప్రపంచంలో ఏ కేలండరూ కూడా కచ్చితమైన కాలమానాన్ని సూచించదు. ఏ కేలండరునైనా అనేక సర్దుబాట్లతోనే ఉపయోగించుకుంటున్నాం. ఆంగ్లేయుల కేలండర్లో లీపియర్స్ ఉంటే తెలుగు వారి కేలండర్లో అధికమాసాలూ, మూఢాలు ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే భూ పరిభ్రమణ కాలానికి ఏ కేలండరునూ సరిపెట్టుకోలేము. ఎవరు ఏ విధంగా వాదించినా ఇది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం. చంద్రుడు ఒక నక్షత్రం దగ్గర బయలుదేరి భూమి చుట్టూ తిరిగి మళ్ళీ అదే నక్షత్రం వద్దకు రావడానికి పట్టే కాలం 27 1/3 రోజులకు సమానం. అమావాస్య నుండి అమావాస్యకి, పౌర్ణమి నుండి పౌర్ణమికి పట్టే కాలవ్యవధి 29 1/2 రోజులకు సమానం. భూమి సూర్యుని చుట్టూ వృత్తాకార కక్ష్యలో కాకుండా అండ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉండడంవల్ల మనం ఏ కేలండర్ అనుసరించినా సంవత్సరంలో అన్ని పగళ్ళూ, అన్ని రాత్రులూ సమానంగా ఉండవు. మార్చ్ 21, సెప్టెంబరు 25, ఈ రెండు రోజులు మాత్రమే గడియారంలో పగలు 12 గంటలు రాత్రి 12గంటలు సమానం. ఇవి మినహా సంవత్సరంలో మిగిలిన ఏ రోజులు కూడా పగలు, రాత్రి సమానంగా ఉండవు. మనం అర్థం చేసుకోవలసింది ఏమంటే.. ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశంలోనూ, ఏ ఖగోళ శాస్త్రవేత్త కూడా కచ్చితమైన కేలండరును తయారు చేయలేకపోయారు. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఖగోళ శాస్త్రమైనా, మరే శాస్త్రమైనా మానవుల సమిష్టి కృషి ఫలితాలేననీ, దేన్ని తమ సొంతంగా ఎవరూ భావించకుండా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో, అభివృద్ధి సాధించే క్రమంలో ప్రపంచ ప్రజలందరూ సమిష్టిగా ఆలోచించడం మాత్రమే ఎంతైనా అవసరం.
అందుకే ఇటువంటి తర్కం లేని పోస్టింగ్ ల గురించి పట్టించుకోకపోవడమే బెటర్.
Ts29.in పాఠకులందరికీ 2020 నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు.