మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్నకు ఆ పార్టీ కేంద్ర నాయకత్వం వార్నింగ్ ఇచ్చింది. దాదాపు మూడున్నరేళ్ల క్రితం పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన జంపన్నను ఉటంకిస్తూ ఆ పార్టీ హెచ్చరించడం బహుషా తొలిసారి కావచ్చు. ఈమేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఓ పత్రికా ప్రకటన వెలువడింది. విప్లవ రాజకీయాల నుంచి హీనాతిహీనంగా దిగజారిపోయిన జంపన్నకు విప్లవ రాజకీయాలపై, పార్టీపై మాట్లాడేందుకు కనీస నైతిక అర్హత లేదని తమ పార్టీ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నది అభయ్ పేర్కొన్నారు. మాజీ మావోయిస్టుగా అవతారమెత్తిన జంపన్న చీటికీ, మాటికీ పోలీసుల కథనాలకు వంత పాడుతూ మీడియా ముందు ప్రత్యక్షం కావడం ఆయనకు మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నట్లు అభయ్ చెప్పారు.
అదేవిధంగా మీడియా తీరుపైనా ఆభయ్ విమర్శలు చేశారు. అవాకులు, చవాకులతో విప్లవోద్యంపై తప్పుడు వార్తలను ప్రచారం చేయడం పాలకులకు అవసరమని, అందుకు తమ చేతుల్లోని మీడియాను అది తప్పక వినియోగించుకుంటుందని అన్నారు. కానీ తమ వృత్తి ధర్మానికి తిలోదకాలిచ్చి తానా అంటే తందాన అన్న చందంగా కొంతమంది పాత్రికేయులు పోలీసు వార్తలను ప్రచారం చేయడాన్ని కూడా తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది చెప్పారు.
కరోనాతో మావోయిస్టుల మరణం అనేది ఒక బూటకంగా, అది పోలీసుల సృష్టిగా అభయ్ అభివర్ణించారు. తమ పార్టీపై పోలీసుల దుష్ప్రచారం ఈనాడు కొత్తేమీ కాదని, గతంలో తమ పార్టీ నాయకత్వం రోగాల పాలై, మంచాన పడిందని కల్పిత కథనాలను ప్రచారం చేశారని ఆరోపించారు. ఇటీవలే తమ పార్టీ ప్రధాన నాయకత్వం లొంగుబాటుకు సిద్ధమైందంటూ సంచలనాత్మక వార్తలను విడుదల చేశారన్నారు. ఇప్పుడు తమకు కరోనా సోకిందంటున్నారని అభయ్ పేర్కొన్నారు. కరోనా వ్యాధితో మావోయిస్టుల మరణాలు, కేడర్లను చికిత్సకు అనుమతించడం లేదంటూ పోలీసులు జరుపుతున్న ప్రచారమంతా బూటకమే తప్ప, అందులో రవ్వంత కూడా వాస్తవం లేదన్నారు. అలా మరణాలే జరిగి ఉంటే తమ పార్టీ ఎలాంటి దాపరికం లేకుండా నిరభ్యంతరంగా ప్రకటిస్తుందని, మావోయిస్టులు మానవాతీతులేమీ కాదని, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ప్రజల మద్య పనిచేస్తున్న మావోయిస్టులకు సోకదనే గ్యారంటీ ఏమీ లేదన్నారు.
కాకపోతే ఇప్పటి వరకు తమ ఉద్యమ ప్రాంతాల ప్రజలకు, తమకు కరోనా మహమ్మారి సోకలేదనే వాస్తవాన్ని తాము తెలియజేస్తున్నట్లు అభయ్ ప్రకటించారు. పోలీసులు ప్రకటించిన జాబితాలోనివారు సహా తమ పార్టీలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు కరోనా సోకలేదన్నారు. అనారోగ్యంతో గల గంగాలు, శోబ్రాయ్ లను అరెస్ట్ చేసి వారికి కరోనా సోకిందనే ప్రచారం నాటకీయమన్నారు. తమకు సోకని కరోనాకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఏమీ లేదని, కానీ వివిధ ప్రాంతాల్లో తమ కార్యకర్తలు ప్రజల మధ్యకు వెడుతూ కరోనా జాగరూకత కార్యక్రమాలు చేపడుతుంటే వారిపై కాల్పులకు పాల్పడడం, మహమ్మారీ కాలంలో ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఫొటో: మాజీ మావోయిస్టు జంపన్న