కరోనా వ్యాక్సిన్ వికటించి ఓ వ్యక్తి మరణించిన తొలి ఘటన దేశంలో నమోదైంది. వ్యాక్సిన్ వల్ల ఓ వ్యక్తి మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం దాని దుష్ఫలితాలను, ప్రభావాలను అధ్యయనం చేస్తున్న అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (AEFI) వ్యాక్సిన్ వల్ల మృతి ఘటనను ధ్రువీకరించింది. గత మార్చి 8వతేదీన కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 68 ఏళ్ల వ్యక్తి ఒకరు తీవ్ర ఎలర్జీ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఏఐఈఎఫ్ మంగళవారం ప్రకటించింది. వ్యాక్సిన్ తర్వాత కలిగే తీవ్ర దుష్ప్రభాావాలకు సంబంధించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ఇండియా టుడే బహిర్గతం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించిన 31 మందిలో కలిగిన తీవ్ర దుష్ఫ్రబావాలపై ఈ కమిటీ స్టడీ చేసింది. అందులో ఒక వ్యక్తి మాత్రం తీవ్ర ఎలర్జీ కారణంగా చనిపోయినట్లు తేల్చింది. కాగా మరో ఇద్దరు వ్యక్తులు కూడా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలర్జీ బారిన పడినప్పటికీ, చికిత్స తర్వాత వాళ్లు కోలుకోవడం గమనార్హం.