కుక్క మాంసం… ఉచ్ఛరిస్తేనే కడుపులో దేవినట్లు అనిపిస్తోంది కదూ? ఎవరి అలవాట్లు వారివి… ఎవరి అభిరుచులు వారివి. ఇందులో తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత కోసం తరచూ రకరకాల భద్రతా బలగాలు దిగుతుంటాయి. నిర్ణీత కాలంపాటు అక్కడ విధులు నిర్వహించిన తర్వాత తమ తమ ప్రాంతాలకు ఈ భద్రతా బలగాలు తిరిగి వెడుతుంటాయి. ఇందులో భాగంగానే కొన్నేళ్ల కిందట నాగాఫోర్స్, మిజో ఫోర్స్ పేర్లు గల నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలకు చెందిన పోలీసు భద్రతా బలగాలు ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి వచ్చాయి.
తెలంగాణా సరిహద్దుల్లో గల ఛత్తీస్ గఢ్ లోని సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో నక్సల్స్ ఏరివేత విధుల్లో గల నాగాఫోర్స్, మిజో ఫోర్స్ పోలీసులను చూసి స్థానికంగా శునకాలు బతుకు జీవుడా అంటూ పరుగులంకించుకునేవి. తమ ఆహార అలవాట్లలో భాగంగా ఆయా ఫోర్స్ లకు చెందిన బలగాలు కుక్క కనిపిస్తే చాలు..అత్యంత లాఘవంగా పట్టుకుని, వాటి మాంసాన్ని ఆరగించేవారు. నాగాఫోర్స్, మిజోఫోర్స్ పోలీసుల ధాటికి కొంతకాలంపాటు ఛత్తీస్ గఢ్ లోని ఆయా ప్రాంతాల్లోనేకాదు, పొరుగున గల తెలంగాణాలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని చింతూరు తదితర ప్రాంతాల్లో కుక్కల ఆచూకీ లేకుండా పోయిందంటే అతిశయోక్తి కాదు. వీధి కుక్కలనేకాదు, పెంపుడు కుక్కలు వీధుల్లో కనిపించినా నాగా, మిజో ఫోర్స్ పోలీసులు వాటిని లటుక్కున పట్టుకుని మాంసంగా మార్చుకునేవారు. ఆ మధ్య సిరిసిల్లలో ఓ ఎన్నికల సందర్భంగానూ బందోబస్తు కోసం వచ్చిన ఆయా పోలీసులు ఇదే తరహాలో కుక్కలను పట్టుకుని మాంసంగా మార్చి భుజించినట్లు వార్తలు వచ్చాయి.
ఇదిగో తాజాగా కుక్క మాంసం మరోసారి వార్తల్లోకి వచ్చింది. త్రిపుర-మిజోరాం రాష్ట్రాల సరిహద్దులో జరిగిన ఘటన ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. ఈ రాష్ట్రాల సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, త్రిపుర నుంచి మిజోరాంకు వీధి కుక్కలను తరలిస్తున్నట్లు చెప్పారు. మిజోరాంలో కుక్క మాంసానికి భారీ డిమాండ్ ఉందని, త్రిపుర నుంచి అక్కడికి శునకాలను తరలిస్తున్నట్లు వారు వివరించారు. మిజోరాంలో ఒక్కో కుక్కను రూ. 2,000 నుంచి 2,500 వరకు ధర పెట్టి కొనుగోలు చేస్తుంటారని వారు స్పష్టం చేశారు. ఆమధ్య కొన్ని స్టార్ హోటళ్లలోనూ మటన్‌కు బదులు కుక్క మాంసాన్ని వడ్డిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. గుర్తుంది కదా? అందుకే… ‘కనకపు సింహాసనంపై శునకం’ అనే పాత సామెతను వదిలేయండి. ఇక నుంచి ‘కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తున్న కుక్క మాంసం’ అని చదువుకోండి.