వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జైలు కూల్చివేత అంశంపై వరంగల్ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు పలు ప్రశ్నలు సంధించారు. కూల్చివేత ఆవశ్యకతను సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రశ్నించారు.
- 135 ఏళ్ల చరిత్ర గల వరంగల్ సెంట్రల్ జైలును కేవలం రెండు రోజుల్లో పూర్తి నేలమట్టం చేయాల్సిన అగత్యం ఎందుకొచ్చింది?
- 55 ఎకరాల్లో కొలువుదీరిన భారీ కట్టడాలు ఎంతో పటిష్టంగా ఉండగానే కూల్చివేయడం ప్రజాధనం వృథా చేయడం కాదా?
- జైలు కూల్చివేత వల్ల ఎంత నష్టం జరిగిందో ప్రజలకు ఎందుకు వెల్లడించడం లేదు?
- జైలు కూల్చివేతలను పరిశీలించే అవకాశం మీడియాకు ఎందుకు ఇవ్వలేదు. ఇంత రహస్యం పాటించడం ఎందుకు?
- జైలు పక్కనే గల కేఎంసీ ఆవరణలో ఇప్పటికే పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇక్కడ పూర్తిస్థాయి వైద్య సేవలకే దిక్కు లేదు. దానిని పట్టించుకోకుండా కొత్త మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన అవసరమా?
- 55 ఎకరాలను ఏ రకంగా వినియోగించుకోబోతున్నారో ప్రజలకు తెలుపకుండా, హడావిడిగా శంకుస్థాపన చేయడంలోని ఆంతర్యం ఏమిటి?
- ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా పేరుపొందిన ఎంజీఎం ఆస్పత్రి మొన్నటి కరోనా సెకండ్ వేవ్‌లో ఏపాటి సేవలందించిందో అందరికీ తెలుసు. సరైన చికిత్స అందక వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్న దానిని సంస్కరించడం పోయి, వందల కోట్లతో కొత్త నిర్మాణానికి సై అనడం ఎలా సబబు?
- కోట్ల రూపాయల విలువైన సెంట్రల్ జైలు కట్టడాలను కూల్చివేశారు. మళ్లీ నగరానికి 20 కి.మీ. దూరంలో కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త నిర్మాణాలను చేయబోతున్నారు. జైలు నిర్మాణాలను కూలగొట్టి కొత్త ఆస్పత్రిని కట్టే బదులు, నగర శివార్లలోని ప్రభుత్వ స్థలాల్లో కట్టే ఆలోచన ఎందుకు చేయలేదు?
- బాగున్న వాటిని కూలగొట్టడం, అదే చోట కొత్తవి కట్టడం ఎవరికి లాభం చేయడానికి?
- ప్రభుత్వ రంగంలో ఆధునిక వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మంచిదే. కానీ పద్ధతి లేకుండా కోట్లు వృథా చేయడం సరైనదేనా?
- తెలంగాణ ఏర్పడిన కొత్తలో హన్మకొండలో మొదలుపెట్టిన కాళోజీ కేంద్ర నిర్మాణం గత ఏడేళ్లుగా నత్తనడకన సాగుతూనే ఉంది. ఇప్పుడు 24 అంతస్తులతో నిర్మించే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎప్పుడు పూర్తవుతుందో ఆ దేవుడికే ఎరుక!?
✍️ శంకర్ రావు శెంకేసి