ఈ చిత్రంలో మీరు చూస్తున్న పాము పేరు ‘రెడ్ సాండ్ బో’. దీని ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 1.25 కోట్లు. ఆఫ్టరాల్ పాముకు అంత ధరా? అని ఆశ్చర్యపోకకండి. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ అంతే. ఇంకా ఎక్కువ మొత్తం కూడా పలికే అవకాశం ఉండొచ్చు. అత్యంత అరుదైన జాతికి చెందిన ఈ పాము విషరహిత జీవి.
శాస్త్రీయ నామంలో ‘రెడ్ సాండ్ బో’గా వ్యవహరించే ఈ పామును మధ్యప్రదేశ్ లోని ఐదుగురు సభ్యుల ముఠా విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అరెస్టయినవారిలో ముగ్గురు మైనర్లు ఉండడం గమనార్హం. నిందితులు నార్సింగ్ ఘర్ బస్ స్టేషన్ వద్ద అమ్మకానికి పెట్టి సెల్ ఫోన్ లో డీల్ కుదుర్చుకుంటుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంతకీ ఈ పాము ఖరీదు అంతర్జాతీయ మార్కెట్లో రూ. 1.25 కోట్లు పలకడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? దీన్ని ఇంట్లో పెంచుకుంటే మంచి జరుగుతుందనే కొందరి నమ్మకం. అంతేకాదు ఖరీదైన మందుల తయారీకి, కాస్మొటిక్స్ ఉత్పత్తుల కోసం దీన్ని వినియోగిస్తారట. కొందరు మంత్రగాళ్లు తమ ‘చేతబడి’ చేష్టల్లోనూ ‘రెడ్ సాండ్ బో’ గా వ్యవహరించే ఈ పామును వాడేస్తారట. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో దీనికి అన్ని కోట్ల ధర పలుకుతుందట. కానీ ఈ పామును కలిగి ఉన్నవారు వన్యప్రాణి రక్షణ చట్టం కింద కటకటాల పాలవుతారు సుమీ. ఆ చట్టం గురించి తెలుసుగా…? సల్మాన్ ఖాన్ జింకల వేట కేసు తరహాలో శిక్ష అన్నమాట. అన్నట్లు… దీన్ని మనం స్థానికంగా రెండు తలల పాముగా పిలుస్తుంటాం.