అసెంబ్లీ నియోకజకవర్గాల పునర్విభజనపై తెలంగాణా శాసనమండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన 2026లో పూర్తవుతుందని, రిజర్వేషన్లు కూడామ మారుతాయని చెప్పారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై సుఖేందర్ రెడ్డి విమర్శలు చేశారు. ఈటల తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారన్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప, హత్యలు ఉండవని గుత్తా అన్నారు. ఈటలకు సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఆస్తుల రక్షణ కోసమే ఈటల బీజేపీలోకి వెళ్తున్నారని, ఉప ఎన్నికలో ఈటల ఓడిపోవడం ఖాయమని, దేవుడు కూడా ఈటలను గెలిపించలేడన్నారు. టీఆర్ఎస్ బలోపేతమైన పార్టీగా చెబుతూ, మరో ఇరవై ఏళ్లపాటు గులాబీ పార్టీ అధికారంలో ఉంటుందని గుత్తా జోస్యం చెప్పారు.