అనుమానం పెనుభూతం అంటుంటారు. పూర్వపు కాలంలో అంటే 13వ శతాబ్ధంలో కరారా ప్రభువు కనిపెట్టినట్లు చరిత్ర గల ఇనుపకచ్చడాల గురించి తెలిసిందే కదా? యురోపియన్లు తాము దేశ పర్యటనలకు వెళ్లేటపుడు తమ భార్యలకు ఇనుప కచ్చడాలు తగిలించి వెళ్లేవారట. ఏళ్ల తరబడి దేశ పర్యటనలకు వెళ్లిన సమయంలో తమ భార్యలు మరెవరితోనూ వివాహేతర సంబంధాలు నెరపకుండా ‘ఇనుప కచ్చడాలు’ తగిలించేవారట. అంటే కరారా ప్రభువులవారు తన రాణి యోనికి తాళం వేసి వెళ్లేవారన్నమాట. తాపీ ధర్మారావు రచించిన ఓ పుస్తకం ఇనుప కచ్చడాల చరిత్ర గురించి మనకు వివరిస్తుంది.
ఇదిగో కలియుగంలోనూ ఓ భర్తకు తన భార్యపై ఎక్కడా లేని అనుమానం కలిగింది. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటుందనే అనుమానంతో ఆమె యోనికి తాళం వేశాడో ప్రబుద్ధుడు. కట్టుకున్నవాడే తనను అనుమానిస్తున్నాడనే ఆవేదనతో ఆ భార్య ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రి పాలైంది. దీంతో సదరు భర్త ‘కచ్చడం’ దురాగతం వెలుగులోకి వచ్చింది.
ఇండోర్ కు చెందిన ఓ ఉన్నత విద్యావంతుడు ఉద్యోగం కూడా వెలగబెడుతున్నాడు. తాను ఆఫీసుకు వెళ్లిన సమయంలో తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం నెరపుతోందనే అనుమానం అతనికి కలిగింది. దీంతో తాను ఆఫీసుకు వెళ్లే సమయంలో తన భార్య యోనికి తాళం వేసి తాళం చెవిని తన వెంట తీసుకువెళ్లేవాడు. తాను అటువంటిదాన్ని కాదని, ఎటువంటి దురుద్ధేశం లేదని, తనను అనుమానించవద్దని భార్య ఎంతగా ప్రాధేయపడినా భర్తలో మార్పు రాలేదు. దీంతో విసిగి, వేసారిన భార్య విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే భర్తే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించగా ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడింది. కానీ అసలు ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు సహజంగానే ఆరా తీస్తారు కదా? బాధితురాలు చెప్పిన భర్త ‘కచ్చడం’ మూర్ఖత్వం తెలిసి పోలీసులు నిర్ఘాంతపోయారు. అనుమానపు భర్తపై కేసు నమోదు చేసి ‘కచ్చడం’ నరకం నుంచి బాధితురాలికి విముక్తి కలిగించారు.